కొత్త రాజధానికి ప్రజల సహకారం అవసరం : చంద్రబాబు

విజయవాడ : కొత్త రాజధానికి ప్రజల సహకారం అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటుచేసిన దూరదర్శన్ సప్తగారి ఛానెల్ ను శనివారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌ను పునాదుల నుంచి నిర్మాంచాల్సిన అవసరం ఉందన్నారు. సంచలనాలు కాదు, విశ్వసనీయత ముఖ్యమని ఆయన తెలిపారు. మంచి కార్యక్రమాలకు వార్తల్లో చోటు లభించడం లేదని బాబు వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ వినూత్న పంథాలో పాలన సాగిస్తూ, దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు దూరదృష్టితో ఆలోచిస్తున్నారని వెల్లడించారు.

ప్రజా జీవనంలో టెలివిజన్ పెనవేసుకు పోయిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పోటీ ప్రపంచంలో అలసత్వానికి అర్ధం లేదన్నారు. టెలివిజన్ ఛానెళ్ల మధ్య పోటీతత్వం పెరిగిందని అభిప్రాయపడ్డారు. మీడియా వార్తలను వార్తలుగానే చూపించాలని, వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానంగానే చూపాలని వెల్లడించారు. మీడియా పనితీరు సత్యానికి దగ్గరగా సంచలనానికి దూరంగా ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.