కొత్త రాష్ట్రం, వెనుకబడిన ప్రాంతం; అధికంగా నిధులు ఇచ్చి ఆదుకోండి

  • ఫైనాన్స్ కమిషన్ కు కేసీఆర్ విజ్ఞప్తి
  • కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి సానుకూలంగా స్పందన
  • రాష్ట్రం నుంచి వసూలు చేస్తున్న కేంద్ర పన్నుల ఆదాయంలో 40 శాతం కావాలని వినతి

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు (కేసీఆర్) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనలు 14 వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి ఆకట్టుకునే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్, ప్రభుత్వ ప్రతినిధులు లేవనేత్తిన అంశాలపై అధ్యయనంచేసి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర అవసరాలను దృష్టి లో ఉంచుకొని కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర పన్నుల రూపేణ వచ్చే ఆదాయంలో 40 శాతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన కోరారు. శాఖల వారీగా ప్రతిపాదనలను ఫైనాన్స్ కమిషన్ సభ్యులకు ప్రభుత్వాధికారులు అందజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రానున్న ఐదేళ్లలో సుమారు 23,475 కోట్ల రూపాయలను గ్రాంటులుగా అందజేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలను పూర్తిగా మాఫీ చేయాలనీ, కొత్త రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధులను కేటాయించాలన్న కేసీఆర్ అభ్యర్ధనకు మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్, ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ రెడ్డి సానుకూలంగా స్పందిచారు.

రాష్ట్ర జనాభాలో 80 శాతం ఎస్.సి, ఎస్.టి, బిసి, ఇతర బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారనీ, తెలంగాణ రాష్ట్రం ఆర్ధికంగా ముందంజలో ఉన్నదనే ప్రచారాన్నివిశ్వసించరాదనీ  సీఎం ఆన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అమ్మకాలు జరిగినప్పటికీ వ్యాట్ పన్ను  హైదరాబాద్ లో చెల్లించడం ద్వారా, అమ్మకం పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. రాష్ట్ర విభజన జరిగింది.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అమ్మకాలకు  ఆ రాష్ట్రానికే వ్యాట్ తో సహా అన్ని పన్నులూ చెల్లిస్తారు. ఆర్థికరంగంలో మళ్ళీ చైతన్యం నింపడం, ఆర్థికాభివృద్ధి సాధించడం ప్రభుత్వం ముందున్న ఒక పెద్ద సవాలని కేసీఆర్ తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కేసీఆర్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులకు చెప్పారు. మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో గత ఆరు దశాబ్దాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా పూర్తిగా వెనుకబడింది. రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల్లోనూ 9 జిల్లాలు వెనుబాటుతనంతో ఉన్నాయి.  వనరుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తగిన మార్పులు చేయాలని కోరారు. కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయాల్సి ఉన్నందున ఆర్ధిక సంఘం సానూకూలంగా  స్పందించి, కొత్త రాష్ట్రంలోని ఇబ్బందికరమైన పరిస్థితులను అర్ధం చేసుకొని అధిక నిధులను కేటాయించాలని విన్నవించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న ఈ యజ్ఞానికి ఇతర రాష్ట్రాలకు భిన్నంగా అధిక ప్రాధాన్యతను ఇచ్చి తోడ్పడగలరని ముఖ్యమంత్రి కేసీఆర్ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

అన్ని ప్రతిపాదనలపై సోమవారం కూలంకషంగా చర్చించి, సమస్యలపై లోతైన అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకిజికి ప్రతిపాదిస్తామని చైర్మన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల వారికి అవసరాలకు అనుగుణంగా ఇచ్చిన ప్రతిపాదనల్లో ఆరోగ్యకరమైన ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. ఎన్నికల వాగ్దానాలను నేరవేర్చే లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని 14వ ఆర్ధక సంఘం చైర్మన్ రెడ్డి మెచ్చుకున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.