కొమురం భీమ్ వీరుడు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 8: జల్, జంగిల్, జమీన్, నినాదంతో ఎన్నో పోరాటాలు చేసి నిజాంను ఎదిరించిన వీరుడు కొమురంభీమ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కొమురంభీమ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. క్రిస్టల్ గార్డెన్ లో బుధవారం జరిగిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొమురంభీమ్ వర్ధంతి రోజున ఈ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించడం మరిచిపోలేని సంఘటన అన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్సీపి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలన్నారు. తెలంగాణలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి నిలబడి పోరాడతానని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

ponguletiతెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించినట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వైఎస్ షర్మిల సహకరిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ ను మించిన నాయకుడు తెలంగాణలో లేరన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ దస్త్రంపై తొలి సంతకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. వైఎస్ఆర్ చనిపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు వేలాది గుండెలు ఆగిపోయాయని, చనిపోయిన వారిలో ఎక్కువమంది తెలంగాణవారే ఉన్నారని ఆమె తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తూ  వైఎస్ఆర్ ఆశయాలను సాధించాలని షర్మిల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.