కొస్తా జిల్లాల్లో తుపాను భీభత్సం

హైదరాబాద్ : హుద్ హుద్ తుపాను తూర్పు తీరంలో ప్రళయాన్ని సృష్టిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు. పెనుగాలులతో భారీ వర్షం పడుతుండటంతో విశాఖలో జనజీవనం స్తంభించింది. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరగడంతో విద్యుత్, రవాణా వ్యవస్థలు స్తంభించాయి. ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వ్యాప్తంగా ఈదురుగాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో, జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ప్రజలకు ఆహార పదార్ధాలు అందించేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జిల్లాలో వేలాది ఎకరాల్లో జొన్న, అరటి, వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది.

తాజాగా హుద్ హుద్ తుపాన్ విశాఖ కైలాసగిరి వద్ద తీరాన్ని తాకింది. విశాఖవైపు దూసుకొచ్చిన తుపాను ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో విశాఖ తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో విశాఖ, విజయనగం జిల్లాలు ఒణికిపోతున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలను చేపడుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.