క్యాబ్ లపై తనిఖీలు

హైదరాబాద్, డిసెంబర్ 10: ఢిల్లీ లో ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలమేరకు రాష్ట్రంలో లైసెన్సులు లేని ట్యాక్సీ సర్వీసులపై తెలంగాణ రవాణాశాఖ దృష్టి పెట్టింది. దీంతో హైదరాబాద్ రవాణాశాఖ అధికారులు క్యాబ్ సర్వీసులపై తనిఖీలు చేపట్టారు.

ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు వెబ్ ఆధారిత సేవలను అందజేసే ఉబర్ ట్యాక్సీ సర్వీసులపై తెలంగాణ రాష్ట్రం నిషేదం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రమంతటా ఈ నిషేదం కొనసాగుతుందని రవాణా కమీషర్ తెలిపారు. ప్రయాణికులు సైతం ఆ సంస్థకు చెందిన వాహనాలను బుక్ చేసుకోవద్దని, వాటిలో వెళ్లవద్దని కమీషనర్ సూచిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా బుకింగ్ లు చేసుకుంటూ సర్వీసులు అందిస్తున్న క్యాబ్ లను రవాణా శాఖ గుర్తించి నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమతి లేకుండా నడుస్తున్న టాక్సీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తున్నారు.

హైదరాబాద్ లో సుమారు 1.6 లక్షల వివిధ రకాల క్యాబ్ లు సర్వీసులు అందిస్తున్నారు. దీంతో గచ్చబౌలీలోని ఆర్టీఏ అధికారులు తనిఖీలను చేపట్టారు. గతంలో హైదరాబాద్ లో జరిగిన అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత చర్యలో భాగంగా తనిఖీలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. క్యాబ్ లో ఎవరెవరిని తీసుకెళ్తున్నారు, డాక్యుమెంట్, పర్మిట్, ఫిట్ నెస్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర వాటిని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా మోటారు వాహనంపై మోటర్ క్యాబ్ అనే బోర్డు ఖచ్చితంగా ఉండాలని, లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.