గుజరాత్ మాదిరిగా జార్ఖండ్ ను అభివృద్ధి చేస్తాం: మోడీ

Narendra-modi

ప్రజల ఆకాంక్ష మేరకే వాజపేయి జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. జార్ఖండ్ సహజ వనరులకు నిలయమైనప్పటికీ పేదరికంలో మగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాజపేయి ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల్లో కేవలం ఛత్తీస్ గఢ్ మాత్రమే అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపారు. ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉన్నతి కోసం కష్టపడి పనిచేస్తోందని అన్నారు. రాంచీలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప్ ర్యాలీలో నరేంద్ర మోడీ ప్రసంగించారు.

50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ జార్ఖండ్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని మోడీ విమర్శించారు. జార్ఖండ్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. 2014 ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను మోడీ కోరారు. గుజరాత్ మాదిరిగా జార్ఖండ్ ను కూడా తాము అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా తాగునీటి కష్టాలు కూడా తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా కోతలు పెడుతోందని విమర్శించారు. దేశం మొత్తానికి సరఫరా చేసేంత బొగ్గు జార్ఖండ్ లో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రం కరెంట్ లేక చీకటిలో మగ్గుతోందని దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. యువతకు విద్య, శిక్షణ, ఉపాధి కల్పిస్తే వలసలు ఆగుతాయని యువత కలలను నెరవేర్చడానికి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని మోడీ ప్రజలను కోరారు. అభివృద్ధి మాత్రమే యువత భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.