గుణపాఠం నేర్చుకోవాలి

గుణపాఠం నేర్చుకోవాలి

ఉప ఎన్నికలలో వివిధ పార్టీలు అనుసరించిన వ్యూహాలు ఫలితాలను నిర్ణయించాయి. ఈ వ్యూహాలు సార్వత్రిక ఎన్నికలలో విజయాన్ని లేదా పరాజయాన్ని ఆయా పార్టీలు అర్థం చేసుకున్న విధానం ప్రకారం రూపొందుతాయి.  ఎన్నికలలో పరాజయాన్ని అర్థం చేసుకోవడం తేలిక. విజయాన్ని అర్థం చేసుకోవడం కష్టం.

సాధారణంగా సార్వత్రిక ఎన్నికల దరిమిలా వెంటనే వచ్చే ఉపఎన్నికల ఫలితాలు ఆయా పాలకపక్షాల స్థితిగతులను మార్చలేవు. ప్రతికూల  ఫలితాలు వచ్చినా,  వాటి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశం అంతకంటే వుండదు. అందుకని ఉపఎన్నికల ఫలితాలపై చర్చకు ప్రాధాన్యత తక్కువ. గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమికీ, ఆంద్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి, తెలంగాణలో కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ కు ప్రజలు ఎవరి మీదా ఆధారపడకుండా మెజారిటీతో ఆయా పార్టీలకి అధికార పగ్గాలను అప్పగించారు. గెలిచి తీరుతాం అనే నమ్మకం వున్న పాలక పక్షాలు, గెలవడం అంత తేలిక కాదు అనే అనుమానం వున్న ప్రతిపక్ష పార్టీలు కూడా  ఉప  ఎన్నికలను  సయితం ఒక సవాలుగా తీసుకుని ఎన్నికల్లో అడుగుపెట్టాలి. తమకున్న శక్తియుక్తులనన్నింటినీ పణంగా పెట్టి పోరాడాలి. గెలిచిన పక్షంలో  తమ పాలనకు మెచ్చి ప్రజలిచ్చిన కానుకగా అభివర్ణించుకుంటూ పాలక పక్షం సంబురాలు చేసుకుంటుంది. అదే ప్రతిపక్షానికి ఆ అవకాశం కలిగితే, పాలకపక్షం పట్ల ప్రజల్లో వేగంగా పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం ఒక సంకేతం అంటూ  ఎదురు దాడికి దిగుతాయి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఖాళీ చేసిన లోక్‌సభ స్థానానికి వారి పార్టీ అభ్యర్థులే గెలుచుకోవడంలో ఆశ్చర్యం లేదు. మెదక్ లోక్‌సభ స్థానంలో తమ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి తన ప్రాబల్యాన్ని నిలుపుకున్నట్టు నిరూపించుకున్నది. ఇక తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు పట్టని వారికి స్థానంలేదని చాటి చెప్పారు.  అట్లని వాపును బలుపుగా భావించరాదనీ, ప్రభంజనం ఒకసారి వచ్చి వెళ్లిపోయేదే కానీ శాశ్వతంగా ఉండదనీ నేర్చుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ నేతను తమ పార్టీలో చేర్చుకుని టిక్కెటు ఇచ్చి మోదీ ప్రభంజనానికి ఢోకా లేదనుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి డ్యూటీలు వేసుకుని మరీ ప్రచారం చేశారు. అయినా రెండు పక్షాలూ కేవలం డిపాజిట్ దక్కించుకోగలిగారు. అదే విధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం తన పార్టీకి చెందిన నందిగామ అసెంబ్లీ స్థానాన్ని తంగిరాల సౌమ్య విజయంతో నిలబెట్టుకున్నది. ఈసారి వైఎస్సార్‌సీపీ రంగంలో లేకపోవడం అక్కడ టీడీపీకి ఎక్కువ మెజారిటీ రావడానికి కారణమయింది.

పరాజయం పాలైనప్పటికీ సర్వస్వం కోల్పోలేదనీ, పార్టీని పునర్మించుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు స్పష్టమైన సందేశాన్నిచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.