గృహాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ నిర్ణయం

kcr-30

హైదరాబాద్, డిసెంబర్ 30: భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అఖిలపక్షం సమావేశం నిర్ణయించింది. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు.

దీంట్లో ప్రధానంగా 125 గజాల లోపు ఉన్న స్థలంలో పేదలు నివాసం ఉంటే ఆ భూమిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 250 గజాల లోపు స్థలంలో గృహాలున్న వారికి 50 శాతం రుసుముతో, 500 గజాల లోపు ఇళ్లు ఉన్నవారికి 75 శాతం రుసుముతో క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. 500 గజాల పైన స్థలంలో ఇళ్లు ఉంటే 100 శాతం రుసుము వసూలు చేసి క్రమబద్ధీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. వీటిల్లో జూన్ 2, 2014 లోపు నివాసం ఉంటున్నట్లు ధ్రువీకరణ చూపించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. ఆ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు గాని మరి ఏ ఇతర ఆధారాలు చూపిస్తేనే దానిని క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

రిజిస్ట్రేషన్ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడానికి 20 రోజుల గడువును విధించారు. మొత్తం 90 రోజుల్లోగా భూముల క్రమబద్ధీకరణ సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి. వాటిని బహిరంగ వేలం వేయాలని, దాని ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఈ వ్యవహారమంతా జాయింట్ కలెక్టర్ లు, ఆర్ డీవోల పర్యవేక్షణలో జరగబోతుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై నేడు ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.