గోళ్ళపాడు ఛానల్ ప్రక్షాళన జరగాలి : తుమ్మల నాగేశ్వరరావు

gollapadu-2

ఖమ్మం: గోళ్ళపాడు ఛానల్ ను పరిశీలిస్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ కె.ఇలంబరితి

ఖమ్మం, డిసెంబర్ 2: నగరంకు ప్రధాన కాలువైన గోళ్ళపాడు ఛానల్ సమూలంగా ప్రక్షాళన జరిగితేనే ఖమ్మం స్మార్ట్ సిటిగా రూపాంతరం చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని గోళ్ళపాడు ఛానల్ ను మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కె.ఇలంబరితి తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛానల్ లో మురుగు నీరు నిల్వ ఉండటం మూలానా దుర్గంధంతోపాటు క్రిమి కీటకాలు వృద్ధి చెందుతున్నాయన్నారు. ఛానల్ ఏర్పడిన తొలినాళ్లలో ఏ విధంగా లోతు, వెడల్పు ఉందో ఆ స్థాయికి తిరిగి గోళ్ళపాడు ఛానల్ ను పునరుద్ధరించవలసి ఉందన్నారు. నగర పారిశుద్ధ్యం బాగుపడాలంటే శాశ్వత పరిష్కారం అవసరమన్నారు. నగరపాలక సంస్థ, ఇరిగేషన్ ఇంజనీర్ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి గోళ్ళపాడు ఛానల్ ను శాశ్వతంగా ప్రక్షాళన చేసేందేకు ఎంత ఖర్చవుతుందో అంచనాలను రూపొందించాలని మంత్రి ఆదేశించారు.

ముందుగా ఛానల్ లోకి వచ్చే నీటిని దారి మళ్లించి కాలువలోకి పేరుకుపోయిన మట్టిని పూడిక తీయాలని మంత్రి తెలిపారు. గోళ్ళపాడు ఛానల్ మొత్తం 27 కిలోమీటర్ల పొడవు ఉందని, ఇందులో 15 కిలోమీటర్ల మేర నగరంలో ఉందని మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. ఛానల్ పై చాలా వరకు నగరంలో చిన్న చిన్న బ్రిడ్జీలు ఉండటంతో పూడిక తీసేందుకు అడ్డంకిగా మారుతుందని వారు తెలిపారు. ఛానల్ పై ఉన్న చిన్న చిన్న బ్రిడ్జీలు పగులగొట్టి వాటి స్థానంలో తాత్కలిక బ్రిడ్జీలు ఏర్పాటుచేస్తే పూడిక తీయడానికి వీలవుతుందని వారు తెలిపారు.

గోళ్ళపాడు ఛానల్ పునర్మించే క్రమంలో అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగించాలని మంత్రి తెలిపారు. అధికారులు దీనిపై సర్వే చేసి, వీటిలో ప్రభుత్వ కట్టడాలు ఉన్నా తొలగించాలన్నారు. మునిసిపల్, ఇరిగేషన్ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి వచ్చే వేసవిలోగా గోళ్ళపాడు ఛానల్ ప్రక్షాళన పూర్తిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోళ్ళపాడు ఛానల్ సందర్శించిన వారిలో ఎంఎల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఆర్ అండ్ బి ఎస్ఈ సతీష్ కుమార్, నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమీషనర్ మనోహర్ తదితరులు ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.