ఘనంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు

saddula 9హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. హుస్సేన్ సాగర్ తీరం జనసంద్రంగా మారిపోయింది. పండుగ చివరి రోజైన సద్దుల బతుకమ్మ తెలంగాణ రాష్ట్రస్థాయి ఉత్సవాలు కన్నులపండువగా హైదరాబాద్ లో జరిగాయి. తరతమ భేదాలు లేకుండా, అంతరాలు మరిచి తెలంగాణ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. సన్నాహాల దశ నుంచి వేడుకల నిర్వహణ దాకా ఉత్సవ సందడి తగ్గకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, బీపీ ఆచార్య, చంద్రవదన్, రాళ్లబండి కవితాప్రసాద్ తదితర ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.

saddula 12బతుకమ్మ పాటలు, డప్పులు, వాయిద్యాలతో హుస్సేన్ సాగర్ ప్రాంతం మార్మోగిపోయింది. కళాకారుల నృత్యాలు కనువిందు చేశాయి. విద్యుత్ కాంతులతో సాగర తీరం దేదీప్యమానంగా వెలుగుతోంది. ట్యాంక్ బండ్ పై భారీవేదికను ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి సతీమణులు విమల, శోభ బతుకమ్మలను ఆడారు. బతుకమ్మ వేడుకలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి మహిళలు వేలాదిగా తరలివచ్చారు. సద్దుల బతుకమ్మ వేడుకలకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ బెలూన్లను ఎగురవేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మపై రూపోందించిన తెలంగాణ పుష్పోత్సవం పుస్తకాన్ని గవర్నర్‌ నరసింహన్‌ ఆవిష్కరించి తొలి ప్రతిని ముఖ్యమంతి కేసీఆర్ కు అందజేశారు. సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ ప్రభుత్వ తొలి మాస పత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించి అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు, తమ కళారూపాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. జిల్లాలకు సంబంధించిన శకటాలు ఆయా జిల్లాల్లోని చారిత్రక అవశేషాలను తెలియజేసే విధంగా తయారుచేసి ప్రదర్శించారు.

saddula 5లాల్ బహద్దూర్ స్టేడియం నుంచి బతుకమ్మ ర్యాలీ ప్రారంభమైన తర్వాత అడుగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. లాల్ బహద్దూర్ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు 3 గంటల పాటు శోభాయాత్ర సాగింది. ట్యాంక్ బండ్ పోడవునా బతుకమ్మలు అలరించాయి. ట్యాంక్ బండ్ కు చేరుకున్న బతుకమ్మలకు పూజ చేసి నిమజ్జనం చేశారు. నిమజ్జనం కోసం అధికారులు ట్యాంక్ బండ్ పై ఆరు ఘాట్లను ఏర్పాటు చేశారు. ముందుగా కవిత తన బతుకమ్మను నిమజ్జనం చేసి ఆ క్రతువును ప్రారంభించారు. అనంతరం ఘాట్ల వద్ద మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఆద్యంతం తిలకించిన గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్సవాలకు వీడ్కోలు పలికారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.