చంద్రజాలం

(తెలిదేవర భానుమూర్తి)

మాయా మ`చ్చంద్రా` మాయంచేయగ వచ్చావా అని ఆంధ్రప్రదేశ్ రైతులు పాడుకొంటున్నారు. ఈ చంద్రులుంగారు కామధేనువు  వంటి పంటభూముల్ని మాయం చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారు. రైతులను ప్రలోభపెడుతున్నారు. సామ, దానోపాయాలు పనిచేయకపోతే భేదోపాయంతో పనిచక్కబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మాయం చేస్తూ వినోదం కలగించేదే ఇంద్రజాలం. మాయం చేసి ప్రజలకు నష్టం చేకూర్చేదే చంద్రజాలం. ఆ చంద్రజాలికుడు ఎవరో కాదు. ఘనత వహించిన ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి చంద్రబాబే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్విన్ కంపెనీని మాయం చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని పంటభూముల్ని మాయం చేయడానికి నడుంబిగించారు.

ఆంధ్రప్రదేశ్ కు విజయవాడను రాజధానిగా చేస్తామని చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. కానీ గుంటూరు జిల్లాలోని  తుళ్లూరును నవ్యాంధ్ర రాజధానికి కేంద్ర బిందువని చల్లగా చెప్పారు. ఆయన జనాలకు మేలు కలిగిస్తున్నట్లు నటిస్తారు. కానీ తన అనుకూలురకు ప్రయోజనం చేకూరే చర్యల్ని చేపడతారు. రహస్య ఎజెండాతో ముందుకు సాగుతారు. తుళ్లూరు కు  చుట్టుపక్కల ఉన్న ముప్పై గ్రామాల్లోని పంటభూముల్ని సేకరించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు మొదలు బెట్టారు. అమల్లో ఉన్న  2014 భూసేకరణ చట్టం ప్రకారం 80% రైతులు భూములు ఇవ్వడానికి అంగీరిస్తేనే భూసేకరణ చేయాలి. రైతులందరూ పంటభూముల్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వారి భూములు బంగారు గుడ్లను ఇచ్చే బాతుల వంటివి. బంగారు గుడ్లను ఇచ్చే బాతులను కోయడానికి రైతులు సిద్ధంగా లేరు. చస్తానే తప్ప  ఏడాదికి మూడు పంటలిచ్చే భూములను ఇవ్వనని  జయమ్మ అనే మహిళా రైతు తేల్చి చెప్పింది. టిడిపి ఎమ్మెల్యే సమక్షంలోనే  పురుగుల మందును తాగుతానంటూ బెదిరించింది. మనిషిని నమ్మితే ఫలితం లేదు. మట్టిని నమ్మితేనే ఫలితముందని ఆమె చాటిచెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ చేస్తానని చంద్రబాబు అంటున్నారు. సింగపూర్ లో ఆకాశహర్మ్యాలున్నాయి. కార్పొరేట్ సంస్థలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారముంది. కానీ రైతులు లేరు. తిండి గింజల గురించి ప్రస్తావించకుండా సింగపూర్ మంత్రం జపించడం వల్ల ప్రయోజనమేమిటి?  భూములు ఇవ్వడానికి అంగీకరించని రైతులను ద్రోహులుగా చిత్రించడానికి యత్నిస్తున్నారు. రైతులంటే మొదటి నుంచీ చంద్రబాబుకు చిన్న చూపే. తుళ్లూరో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరం భూమి ధర కోటి రూపాయలకు పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు హామీలపై నమ్మకంలేని కొందరు రైతులు తమ భూముల్లో కొంత భూమిని అమ్ముకొంటున్నారు.   ఆయన దృష్టిలో ఐ.టి పండగ. వ్యవసాయం దండగ.

ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణాలన్నిటినీ మాఫీ చేయాలంటే 80 వేల కోట్లరూపాయల అవసరం. హైదరాబాద్ మీద వచ్చే ఆదాయమంతా తెలంగాణకే చెందడంతో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే ఆదాయం తగ్గిపోతుందని తెలిసినా రైతుల రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని తెలుగుదేశం అధ్యక్షుడు వాగ్దానం చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. కానీ రైతులు చంద్రబాబు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఆయనకే అధికారాన్ని కట్టబెట్టారు. గతంలో  రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామనే వాగ్దానం ద్వారానే  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ వాగ్దానాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అప్పుడు ఆయన చేసిన తప్పునే ఇప్పుడు జగన్ చేశారు. ప్రతిపక్షనాయకుడిగానే మిగిలిపోయారు. రైతుల రుణాలను ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయల మేరకే మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో 72 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. పాత రుణాలు చెల్లిస్తేనే బ్యాంకులు కొత్త రుణాలిస్తాయి. మొత్తం కాకున్నా తీసుకొన్న రుణ మొత్తంలో 75 శాతం చెల్లిస్తేనే రుణాలు మంజూరు చేస్తాయి.

రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్కు శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం భూములిచ్చిన  రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించరు.అభివద్ధి చేసిన భూముల్లో  కొంత భూమితో పాటు ఏడాదికి కొన్ని వేల రూపాయల వంతున రైతులకు ఇస్తారు. చంద్రబాబు అపర ఛాణుక్యుడే. కానీ YOU CAN FOOL  ALL THE PEOPLE SOME OF THE TIME, SOME OF THE PEOPLE ALL THE TIME BUT NOT ALL THE PEOPLE ALL THE TIME అన్న లింకన్ సూక్తిని గుర్తుంచుకొంటే మంచిది. (నువ్వు అందరిని కొంత కాలం వెర్రివాళ్లను చేయవచ్చు. కొంతమందిని ఎల్లప్పుడు వెర్రివాళ్లను చేయవచ్చు. కాని అందరిని అన్ని కాలాల్లో వెర్రివాళ్లను చేయడం అసాధ్యం)

Have something to add? Share it in the comments

Your email address will not be published.