బాబుతో చర్చలకు ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధం : కేసీఆర్

హైదరబాద్, నవంబర్ 2: హైదరాబాద్ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో చర్చకు ఎక్కడైనా సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు. మల్కాజ్ గిరి డిఫెన్స్ కాలనీలో నిరంతరం తాగు నీటి పథకానికి ఆదివారం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలను చంద్రబాబు బురిడి కొట్టించారని ఆరోపించారు.  జంటనగరాలకు ప్రతి రోజు సుమారు 5 ఎంజిడీల తాగు నీరు కావల్సి ఉండగా, 348 ఎంజిడీలు మాత్రమే సరఫరా అవుతుందన్నారు. కొంత మంది నాయకులు హైదరాబాద్ ను మేమే కట్టామని, నిర్మించామని చెప్పుకోవడం సిగ్గుచేటనిపిస్తుందని అన్నారు.

తెలంగాణకు వచ్చే విద్యుత్ వాటాను ఇవ్వకుండా, తెలంగాణలోని పంటలు ఎండగొట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు మాయలోపడి తెలంగాణకు అన్యాయం చేయడానికి ముందుకు పోతుంది ముఖ్యమంత్రి ఆరోపించారు. గత 19 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సం కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం జలాశయంలో ఏ ఒక్క రోజు 800 అడుగుల నీటి మట్టం నిల్వ ఉంచలేదన్నారు. ప్రస్తుతం జలాశయంలో 859 అడుగుల నీటి మట్టం ఉన్నా రోజుకి ఒక్కసారి కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయెద్దని కృష్ణా ట్రిబ్యునల్ చైర్మన్ ఇచ్చిన తీర్పుపై ఆయన మండిపడ్డారు.

శ్రీశైలం వివాదంలో కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. కరెంటు సమస్యపై కాంగ్రెస్, టిడిపి చెప్పే మాటలు నమ్మోద్దని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆరె నెలల్లో విద్యుత్ సమస్యను తీరుస్తామన్నారు. నాలుగేళ్లలో జంటనగరాల్లో ప్రతి ఇంటికి నల్లా సౌకర్యం కల్పిస్తామనీ, లేదరంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని పునరుద్ఘాటించారు.  హైదరాబాద్ లో పేదలు ఎక్కడ గుడిశెలు వేసుకొన్నా, వారికి అక్కడే ఇళ్ల పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటెల, మహేందర్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.