చెడు వ్యసనాలకు లోనై, డబ్బు కోసమే ఓబులేష్ ఘాతుకం

 

mahender reddy-21

ఓబులేష్ ఉపయోగించిన ఏకే-47 తుపాకిని చూపిస్తున్న నగర పోలీసు కమీషనర్ మహేందర్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 22: అరబిందో ఫార్మా ఉపాధ్యక్షుడు నిత్యానందరెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. ఘటన జరిగిన 24 గంటల్లో నిందితుడు ఓబులేష్ ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలను పోలీసు కమీషనర్ ఎం.మహేందర్ రెడ్డి శుక్రవారం విలేకరులకు వివరించారు. కానిస్టేబుల్ గా ఉన్న ఓబులేష్ చెడు వ్యసనాలకు లోనై, డబ్బు కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పారు. సంపన్నలు, వారి కుటుంబ సభ్యులను తుపాకీ వంటి ఆయుధాలతో బెదిరించి అపహరిస్తే లక్షలాది రూపాయలు వస్తాయని ఓబులేష్ భావించాడన్నారు. ఈ క్రమంలోనే గతంలో గ్రేహాండ్స్ లో పనిచేస్తున్న సమయంలో ఆయుధాలు భద్రపరిచే బెల్ ఆఫ్ ఆమ్ నుంచి ఏకే 47ను దొంగిలించి రూ 10 లక్షలు వసూలు చేశాడన్నారు. అది విజయవంతం కావడంతో కేబీఆర్ పార్కు వద్ద నిత్యానందరెడ్డిని అపహరించేందుకు ఓబులేష్ పథకం వేశాడని తెలిపారు.

బంజరాహిల్స్ కేబీఆర్ పార్కుకు మార్నంగ్ వాక్ కు వచ్చే సంపన్నులను అపహరించి డబ్బులు వసూలు చేయాలనేది ఓబులేష్ పథకం పన్నాడు.  మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఏకే 47తో సహా కేబీఆర్ పార్క్ కు చేరుకొని చెట్ల గుబురుల్లొ దాక్కుని ఉన్నాడు. ఉదయం పార్కు వద్ద ఆడి కారు ఆగి ఉండటాన్ని చూసిన ఓబులేష్, దాని యజమానిని అపహరించి డబ్బు వసూలు చేద్దామనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయ నడక ముగించుకొన్న నిత్యానందరెడ్డే యజమాని అని తెలియక ఆయనను అపహరించాలనుకున్నాడు. ఈ క్రమంలో నిత్యానందరెడ్డి కారులో కూర్చున్నవెంటనే ఓబులేష్ ఆయనను తన వెంట తెచ్చుకున్న ఏకే 47 తుపాకీతో బెదిరించాడు. వీరిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో ఏకే47 తుపాకీ పేలడంతో నిత్యానందరెడ్డి కారు అద్దాలు ధ్వంసమైనాయి. ఈ నెపథ్యంలో నిత్యానంద రెడ్డి సహాయం కోసం అరవగా, అక్కడే ఉన్న తన తమ్ముడు ప్రసాద్ రెడ్డి ఓబులేష్ ను వెనుకనుంచి పట్టుకున్నాడు.  దీంతో తన పథకం పారలేద విషయాన్ని తెలుసుకున్న ఓబులేష్ ప్రసాద్ రెడ్డి చేయ్యి కొరికి, వెంట తెచ్చుకున్న ఏకే47 తుపాకిని అక్కడే వదిలేసి ఓబులేష్ పారిపోయాడని తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ఓబులేషే నని నిర్ధారణకు వచ్చి అతనిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు సీపీ అంజనీకుమార్, సంయుక్త కమీషనర్ నాగిరెడ్డి డీసీపీలు వెంకటేశ్వరరావు, లింబారెడ్డి తదితరులు పాల్గొన్నారు.‎

Have something to add? Share it in the comments

Your email address will not be published.