చెస్ట్ ఆస్పత్రిని సందర్శించిన వామపక్ష నేతలు

హైదరాబాద్ : ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని వామ పక్షాలు బుధవారం సందర్శించాయి. ఆస్పత్రిని వికారాబాద్ కు తరలించవద్దని సిబ్బంది, రోగుల చేస్తున్న పోరాటానికి తమ మద్దతును తెలిపాయి. అంతకు ముందు ర్యాలీగా వచ్చిన వామపక్ష నేతలు ఆసుపత్రి సిబ్బంది, రోగులతో మాట్లాడారు. వారి పోరాటానికి బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన అసెంబ్లీలో వాస్తు నమ్మకాల గురించి బాహాటంగా చెప్పి చర్చించడానికి ప్రభుత్వం పూనుకుంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర సచివాలయం భవనం వాస్తు దోషంతో ఉన్నాయి కాబట్టి మేము మార్చదల్చుకున్నాం అని కోర్టులో అఫడవిట్ దాఖలు చేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లనుంచి ప్రజలకు సేవలు అందిస్తున్న చెస్ట్ ఆసుపత్రిని ఒక ఆశాస్త్రీయమైన భావజాలంతో వికారాబాద్ కు తరలించవద్దని ఆయన కోరారు. చెస్ట్ ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలను మెరుగుపర్చి సేవలందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు దూరం చేయడమే అవుతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రజలందరికి అందుబాటులో ఉన్న చెస్ట్ ఆసుపత్రిని వాస్తు పేరుతో వికారాబాద్ కు తరలించడం అన్యాయమన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ తరలింపు యోచనను ప్రభుత్వం విరమించుకొనేంతవరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.