జగన్ లక్ష కోట్ల దోపిడీ వాస్తవమా.. కాదా..?: బాబు

chandrababu-praja-garjana

నెల్లూరు ప్రజాగర్జన సభలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేశంగా ప్రసంగం ప్రారంభించారు. పౌరుషానికి ప్రతీక సింహపురి గడ్డ అని బాబు తన ఉపన్యాసాన్ని మొదలుపెట్టారు. తిక్కన, మొల్ల, పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు పుట్టిన పుణ్యభూమి ఇదని… బెజవాడ గోపాల్ రెడ్డి, ఆత్రేయ, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి ఆణిముత్యాలు జన్మించిన గడ్డ ఇది అని కొనియాడారు.

ప్రజాగర్జన సభ సందర్బంగా పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారికి పసుపు కండువాలు అందించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి, పోలం రెడ్డి తదితరులు టీడీపీలో చేరినవారిలో ఉన్నారు.

విభజన అనంతరం రెండు రాష్ట్రాలు అనివార్యమైన నేపథ్యంలో సామాజిక తెలంగాణ, సీమాంధ్ర అభివృద్ధి తన ధ్యేయమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ఢిల్లీని గజగజలాడించారని పేర్కొన్నారు. అదే వైఎస్సార్సీపీకి ఓటేస్తే ఆ పార్టీ నేతలు ప్రధాని మన్మోహన్ ను కూడా నిలదీయలేరని ఎద్దేవా చేశారు. సైకో జగన్ పార్టీకి ఓటేస్తే అంతేసంగతులని బాబు వ్యాఖ్యానించారు. బైబిల్ పట్టుకుని తిరుగుతూ ప్రజలను మోసగిస్తారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ఉండే జిల్లా అని అభివర్ణించారు. ఈ జిల్లాకు ఉన్న వనరులు ఎక్కడా లేవని చెప్పారు. ఇక్కడికి కొన్ని పరిశ్రమలు రాకుండా కొందరు అడ్డుకోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. తాము కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు చేస్తే ఇనుప ఖనిజాన్ని దొంగరవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ పై ఈడీ కొరడా ఝుళింపిచడంలో ఆశ్చర్యమేమీలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆయన ఆస్తులు మూడుసార్లు జప్తు చేశారని బాబు గుర్తు చేశారు. తాను అప్పట్లో చెప్పినట్టు జగన్ లక్ష కోట్ల దోపిడీ వాస్తవమా?కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు 43 వేల కోట్ల దోపిడీ జరిగిందని సీబీఐ తేల్చింది. జగన్ నవతరం నాయకుడు కాదని, దోపిడీ తరం నాయకుడని బాబు ఎద్దేవా చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.