జయ పరాభవం

  • ఎన్నికల్లో ఘన విజయం
  • అంతలోనే ఘోర పరాజయం
  • జయకు ఎదురుదెబ్బ

బెంగళూరు, సెప్టెంబర్ 27 : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితను దోషిగా ప్రకటించడంతో దేశంలో అన్ని రాజకీయ వర్గాల వారికి ప్రకంపనలు సృష్టించాయి. జయలలితను దోషిగా నిర్ధరించిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్షతోపాటు రూ 100 కోట్ల జరిమానా విధించింది. కోర్టు తీర్పు ప్రకటించగానే జయలలితను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. వీరందరికి కూడా నాలుగేళ్లు జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ 10 కోట్ల చొప్పున జరిమానా విధించింది.

18 సంవత్సరాల క్రితం డాక్టర్ సుబ్రమణియన్ స్వామి జయలలిత అక్రమాస్తులు కూడబెట్టారని ఫిర్యాదు చేశారు. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు జయలలిత సీఎంగా ఉన్న సమయంలో ఈ ఆరోపణలు వెలువత్తాయి. 1996 సంవత్సరంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో జయలలితపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. జయలలితతో పాటు ఆమెకి అత్యంత సన్నిహితురాలైన శశికళ, ఆమె కుమారుడు సుధాకర్, బంధువు ఇళవరసి కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అప్పట్లో జయలలిత ఇంట్లో ఏసిబి జరిపిన సోదాల్లో 880 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 10 వేలకు పైగా చీరలు, 90 గడియారాలు, 750 జతల పాదరక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఒక్క రూపాయి వేతనం తీసుకుని ఇంత ఆస్తి ఎలా కూడబెట్టారని అప్పట్లో అభియోగం వచ్చింది. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతోంది. దీనిపై 2011లో జయలలిత స్వయంగా కోర్టుకెళ్లి వాంగ్మూలం ఇచ్చారు.

ఈ కేసు విచారణ తొలుత చెన్నైలోనే జరిగినా మళ్లీ జయలలిత సీఎం కావడంతో న్యాయస్థానాన్ని ప్రభావితం చేస్తారని డీఎంకే పిటిషన్ దాఖలు చేసింది. డీఎంకే పిటిషన్ తో జయలలిత కేసు విచారణ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానానికి మారింది.

దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన కేసు విచారణలో 14 మంది జడ్జీల సమక్షంలో విచారణ జరిగింది. తుదకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు ప్రాంగణంలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మైఖేల్ డీ చున్హా నేడు తుది తీర్పును వెలువరించారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జయలలిత ముఖ్యమంత్రి హోదాతో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోనున్నారు.  దీంతో  శిక్షా కాలం నుంచి పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా పోయింది. అనర్హత వేటు పడిన తొలి ముఖ్యమంత్రిగా జయలలిత రికార్డుల్లోకెక్కారు.

ప్రత్యేక కోర్టు తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కర్ణాటక హైకోర్టులో మాత్రమే విజ్ఞప్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. తీర్పును సవాలు చేస్తూ ఆమె సోమవారం అప్పీలుకు వెళ్లే అవకాశముంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.