జూనియర్ డాక్టర్లు బాధ్యతలు మరిచిపోవద్దు : రాజయ్య

హైదరాబాద్, అక్టోబర్ 11: రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సుమారు 11 రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. చర్చలు సఫలం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యతో జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు చర్చలు జరిపారు. మధ్యాహ్నం వరకు చర్చల్లో ఎటువంటి పురోగతి లేదు. శాశ్వత ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నియమిస్తేనే అక్కడ పనిచేస్తామని జూనియర్ డాక్టర్లు తెలుపుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా లేదు. సమ్మె పరిష్కారం కోసం ఇరువర్గాలు పట్టువిడుపులు ప్రదర్శించాలని ప్రజలు కోరుతున్నారు.

జూనియర్ డాక్టర్ల తమ హాక్కులను గుర్తించాలని, భాద్యతలను మరిచిపోరాదని ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. శనివారం సచివాలయంలో తన ఛాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరి ప్రోద్భలంతో జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తున్నారో తెలియడం లేదన్నారు. వారి కోర్కెల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా, సమ్మె కొనసాగించడం సరైందికాదన్నారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తేనే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తామనడం సరికాదన్నారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడబోనని రాజయ్య తెలిపారు. అయినా జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని  ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.