టిడిపి సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతపై శాసనసభలో రగడ

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ శాసనసభ జీరో అవర్ లో టిడిపి సభ్యులు సస్పెన్షన్ ఎత్తివేతపై తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భాజపా శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ మాట్లాడుతూ శాసనసభ సమావేశాలు అధికార పక్షంతో పాటు అన్ని రాజకీయ పార్టీల సభ్యుల సమన్వయంతో నిర్వహించకోవాలన్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి ఈ అంశాన్ని తెరదించి సస్పెన్షన్ కు గురైన సభ్యులను అనుమతించాలని ఆయన కోరారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సభ్యుని విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేస్తున్నట్లు నిజామాబాద్ ఎంపి ఎంతో హుందాగా తెలిపారన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసే అంశాన్ని పున:పరిశీలించాలని ఆయన స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. లక్ష్మణ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ “సస్పెన్షన్ అయిన తరువాత కూడా సభ్యునికి పశ్చాత్తాపం రాలేదు. ఈ మధ్యనే మహారాష్ట్ర గవర్నర్ మీద సభ్యులు దాడి చేశారు. అక్కడ సభ్యులను రెండు సంవత్సరాలు మీ ప్రభుత్వం సస్పెండ్ చయవచ్చు, ఇక్కడ మేము వారం రోజులపాటు సస్పెండ్ చేస్తే తప్పా“ అని ప్రశ్నించారు.

 

శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సభ్యునికి వివరణ ఇవ్వడానికి అవకాశం ఇచ్చినా, వివాదాస్పద వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు గాని, క్షమాపణ చెప్పే ప్రయత్నం గాని చేయకుండా తిరిగి ప్రత్యారోపణలు చేసే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పటికైనా తెదేపా సభ్యుడు క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఒక వైపు రాష్ట్రంలో కరెంటు సరిపోక, రైతులు అల్లాడుతుంటే తెలంగాణ రాష్ట్రమే ఎక్కవు కరెంటు వాడుతుందని, రాష్ట్ర ద్రోహాన్ని తలపెట్టే విధంగా సభ్యుడు మాట్లాడన్నారు. పత్రాలను సభకు సమర్పించండి వాటిని పరిశీలిస్తాం అని సభ్యుని ముఖ్యమంత్రి కోరినా ఇంతకు సభకు సమర్పించలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజా విలువలను గౌరవించాలి, సభ సజావుగా జరగాలి, సభలో అందరూ చర్చించాలి అని ప్రభుత్వం కోరుకుంటుంది హరిష్ రావు స్పష్టం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.