డీకే అరుణ-కేటీఆర్ ల మధ్య దూషణల పర్వం

dkaruna-ktr-10

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో బుధవారం జరిగిన సమాశాల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రధాన ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ మంత్రి డీకే అరుణ, రాష్ట్ర మంత్రులు  కేటీఆర్, జగదీష్ రెడ్డి, కడియం శ్రీహరి ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకొంది. ఒకనొకదశలో మాటల యుద్ధం పతాక స్థాయికి చేరడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంతో ఇరుపక్షాల వారు తమ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

మహబూబ్ నగర్ జిల్లాలోని గుర్రంగడ్డ గ్రామానికి బ్రిడ్జి సౌకర్యం కల్పించాలని బుధవారం ఉదయం శాసనసభ జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యురాలు డీకే అరుణ కోరారు. ఆమె అడిగిన ప్రశ్నకు అధికార పక్షం సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన డీకే అరుణ నోరు మూసుకో అంటూ హెచ్చరించారు.  దీంతో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి డికె అరుణ వ్యాఖ్యలకు ఎదురుదాడికి దిగారు. గతంలో చిన్నారెడ్డి, డీకే అరుణ మంత్రులుగా ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించడంతోపాటు, పాలమూరులో చేస్తున్న దాదాగిరి, బంగ్లా రాజకీయాలు ఇక్కడ నడవదంటూ పరుష పదజాలం ఉపయోగించారు. దీంతో వారి మధ్య వివాదం ముదిరింది.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అరుణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన ప్రశ్నకు సమాధానం చెప్పడంలో విఫలమయ్యారంటూ వారిని విమర్శిస్తూ మైక్ విరగ్గొట్టారు. అనంతరం మాట్లాడిన మంత్రి కడియం శ్రీహరి మైక్ విరగ్గొట్టినందుకు మహిళా లోకం సిగ్గుతో తలదించుకుంటారని వ్యాఖ్యానించడంతో సభ వేడెక్కింది. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తూ, మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించలేని వారు మహిళలపై విమర్శలు చేయడం మంచిదికాదని డీకే అరుణ సమాధానం చెప్పారు. దానికి స్పందించిన కేటీఆర్ తాము సమీకరణాల కారణంగా మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేకపోయినా, మంత్రులను, మహిళా ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిన ఘతన తమకు లేదన్నారు.

అనంతరం గందరగోళం మధ్య సభ వాయిదా పడింది. సభ ప్రారంభమైన తర్వాత, ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రభుత్వం తీరుపై సున్నితంగా విమర్శలు చేశారు. తాము హుందాగా ఉన్నప్పటికీ అధికారపక్షం వారు దూకుడుగా, ఆవేశంగా విమర్శలు చేయడం సరికాదన్నారు.

తర్వాత ముఖ్యమంత్రి స్పందించారు. అంతకుముందు ఒక ప్రశ్నకు విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెబుతూ… నీయవ్వ అని సంబోధించడంతో వివాదం చెలరేగింది. దీనికి సిఎం సూచన మేరకు ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు.

కేటీఆర్, డీకే అరుణ వివాదం విషయంలో సభలో మాట్లాడిన వీడియో పుటేజీలు చూసిన తర్వాత, అందరి అభిప్రాయం మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. గంటన్నర పాటు వీడియో పుటేజీలు పరిశీలించిన తర్వాత కేటిఆర్, డీకే అరుణ తమ వైఖరిపై విచారం వ్యక్తం చేయాలని అందరి సూచన మేరకు స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.

తిరిగి సభ ప్రారంభం కాగానే డీకే అరుణ మరోసారి ప్రభుత్వ వైఖరిపై నిప్పులు కురిపించారు. మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడడం తగదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ముఖ్యమంత్రి కూతురు కవిత రెండుచోట్ల సమగ్ర కుటుంబ సర్వేలో పేరు నమోదు చేయించుకున్న విషయాన్ని సభలో ప్రస్తావించడమే మహిళలను అగౌరవపరిచినట్లు కాదా, అని అప్పుడు మాట్లాడిన వారు ఇప్పుడు తనను అగౌరవపరచడం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కూతురుకు ఒక నీతి తనకు ఒక నీతా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా వివాదం మరింత ముదిరే దశలో సభాపతి ఈ అంశాన్ని వదిలేసి సభను నడిపేందుకు ఉపక్రమించారు. దీనిపై బీజేపి నేత లక్ష్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాఖ్యల ఉపసంహరణ విషయాన్ని ఎందుకు వదిలేశారని సభాపతిని ఆయన ప్రశ్నించారు. దానికి ఎవరూ ముందుకు రావడంలేదని సభాపతి మధుసూదనాచారి బదులిచ్చారు. దీనికి లక్ష్మన్ మాట్లాడుతూ క్షమాపణ చెప్పడానికి ముందుకు రాకపోతే ఆ విషయాన్ని అంతటితో వదిలేయడమేనా అని ప్రశ్నించారు. అదే రూల్ అయితే టీడీపీ వారు క్షమాపణ చెప్పకపోతే వారిని వదిలేయకుండా బడ్జెట్ సెషన్ మొత్తానికి ఎందుకు సస్పెండ్ చేశారని లక్ష్మణ్ ప్రశ్నించారు.

లక్ష్మన్ వ్యాఖ్యలు సర్కారును ఇరుకున పెట్టినట్లైయ్యాయి. అదే సమయంలో డీకే అరుణ కూడా తగ్గకుండా సర్కారును ఇరుకునపెడుతోంది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ముందుగా అధికారపక్షం నుంచే విచారం వ్యక్తం చేయాలని సూచించడంతో కెటిఆర్ తన వ్యాఖ్యల పట్ల విచారం తెలిపారు. అనంతరం డీకే అరుణ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.