ఢిల్లీ ఏడవ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

Arvind-kejriwal-delhi-cm

ఢిల్లీ ఏడవ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేజ్రీవాల్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఈశ్వరుడిపై ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఏపీ అభిమానులతో రాంలీలా మైదానం కిక్కిరిసి పోయింది. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే మైదానం మొత్తం కార్యకర్తల కేరింతలతో మారుమోగింది.

ఢిల్లీలో సాధించిన విజయం కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతల వల్లే సాధ్యం కాలేదని ఢిల్లీలోని కోటిన్నర ప్రజల వల్ల సాధ్యమైందని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఇంతటితో పోరాటం ముగిసిపోలేదని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని కేజ్రీవాల్ తెలిపారు. అసలు పోరాటం ఈ క్షణం నుంచే ప్రారంభం కానుందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉన్న కోటిన్నర మంది పోరాటం, ఉక్కు సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రతి క్షణం కష్టపడతామని భరోసా ఇచ్చారు.

దేశంలో నెలకొన్న దుష్ట సంప్రదాయాన్ని, ఢిల్లీలో నెలకొన్న సంక్షోభాల్ని అందరం కలిసి తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. తమ వద్ద అన్ని సమస్యల పరిష్కారానికి మంత్రదండం లేదని మనమందరం కలసి సమస్యలన్నింటికీ పరిష్కారమార్గాలు వెతుకుదామని కేజ్రీవాల్ తెలిపారు.

కేజ్రీవాల్ తో పాటు మరో ఆరు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో మనీష్ శిసోడియా (41), సోమ్ నాథ్ భారతి (39), సత్యేంద్ర కుమార్ జైన్ (49), రాఖీ బిర్లా (26), గిరీష్ సోని (49), సౌరభ్ భరద్వాజ్ (34)లు ఉన్నారు. వీరికి శాఖలు కేటాయించాల్సి ఉంది. కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఏ ఒక్కరూ 50 ఏళ్లకు పైబడిన వయసు కలిగిన వారు లేకపోవడం గమనార్హం.

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి ఢిల్లీ పీఠంపై సగర్వంగా కూర్చున్న కేజ్రీవాల్ తన మంత్రి వర్గ ఎంపికలోనూ ప్రత్యేకతను చాటారు. శనివారం మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఏ ఒక్కరు కూడా 50 ఏళ్ల వయసు దాటలేదు. ఇంకో విషయం ఏంటంటే ఏ ఒక్కరికీ కూడా గతంలో రాజకీయ అనుభవం లేదు. మొదటి సారి రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా మంత్రులైపోయారు.
వారి వివరాలు…

మనీష్ శిసోడియా (41): కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తుడు. ఆయన ఏఏపీలో చేరకముందు సమాచార కార్యకర్తగా, జర్నలిస్టుగా పనిచేశారు. 2011 నుంచి జనలోక్ పాల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

సోమ్ నాథ్ భారతి (39): ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే న్యాయశాస్త్రంలోనూ పట్టా పుచ్చుకున్నారు. కాంగ్రెస్ మంత్రి కిరణ్ వాలియాను ఓడించారు.

సత్యేంద్ర కుమార్ జైన్ (49): ఆర్కిటెక్ట్ గా జీవితాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విభాగంలోని అవినీతితో విసిగిపోయి స్వతంత్రంగా కన్సల్టెన్సీని ప్రారంభించారు. జనలోక్ పాల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

రాఖీ బిర్లా (26): మాజీ జర్నలిస్టు. ఏఏపీ లో చేరకముందు ఆమె ఓ ప్రైవేటు వార్తా చానెల్లో పనిచేశారు. షీలా ప్రభుత్వంలో తిరుగులేని నాయకుడైన మంత్రి రాజ్ కుమార్ చౌహాన్ ను రాఖీ 10 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు.

గిరీష్ సోనీ (49): భారత్ నవ జవాన్ సభలో పనిచేశారు. ఢిల్లీ నగరంలో తాగునీరు, విద్యుత్ ఛార్జీలపై అలుపు లేని పోరాటం చేశారు. ఏఏపీ నిర్వహించిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

సౌరబ్ భరద్వాజ్ (34): ఇంజినీరింగ్ తో పాటు, న్యాయశాస్త్రంలోనూ డిగ్రీలు పొందారు. బీజేపీ నేత వీకే మల్హోత్రా కుమారుడు అజయ్ కుమార్ మల్హోత్రాను 13 వేలకు పైగా ఓట్లతో ఓడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.