తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను అడ్డుకుంటున్నారు : కేసీఆర్

హైదరాబాద్, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్ నుండి చట్టప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం  అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావల్సిన విద్యుత్ ను రాకుండా అడ్డుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. క్రిష్ణపట్నం నుంచి తెలంగాణకు రావల్సిన 196 మెగావాట్ల విద్యుత్ ను రాకుండా అడ్డుకుంటుందన్నారు. దిగువ సీలేరు, డొంకరాయి, ఎగువ సీలేరు లో 725 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా, దాంట్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 390 మెగావాట్ల విద్యుత్ లో ఒక్క యూనిట్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అదేవిధంగా అనంతపూర్, కర్నూల్ సౌరవిద్యుత్ 570 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా దాంట్లో తెలంగాణ వాటా 380 మెగావాట్లు రావాలి. అది కూడా రాకుండా చేస్తున్నారు. మాచ్ ఖండ్, టీవీ డ్యామ్లో 130 మోగావాట్ల ఉత్పత్తి అవుతుండగా అక్కడి నుంచి రావాల్సిన 36 మెగావాట్ల విద్యుత్ ను అడ్డుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. హిందూజ 1040 మోగావాట్ల సామరధ్యం కలిగిన పవర్ స్టేషన్ తెలంగాణకు రావాల్సిన 561 మెగావాట్ల విద్యుత్ పై తెలంగాణకు అర్హత ఉందని వివరించారు. దీనిని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చే ప్రస్తక్తి లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నుండి విద్యుత్ ఇచ్చేందుకు సుముఖతగా లేదని, ఈ అంశాలపై అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. అమలులో ఉన్న, నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇరువురికి విద్యుత్ పంపకాలపై జీవో జారీ చేశారని స్పష్టం చేశారు. సీఈఏ ఇచ్చిన ఆదేశాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.