తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయండి : కేసీఆర్

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం భేటీ ఆయ్యారు. సుమారు గంటపాటు సాగిన సమావేశంలో హైకోర్టు విభజన అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న భవనంలోనే రెండు రాష్ట్రాలకూ విడివిడిగా హైకోర్టులు పనిచేసేలా సత్వరం నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ కోరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా హైకోర్టును రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని కోరారని తెలిసింది.

ఒకే భవన సముదాయంలోనే రెండు హైకోర్టుల ఏర్పాటుపై గతంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఒకే భవనంలోనే ఈ రెండు కోర్టులు పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా వివరించారు. ఒకే భవనంలో సచివాలయం, శాసనసభలు సజావుగా సాగుతున్నా, వీటి నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు రావటం లేదని చెప్పారు. అదే తీరులో హైకోర్టు కూడా విడివిడిగా ఒకే భవనం నుంచి పని చేయడంలో ఎలాంటి సమస్యలు ఉండబోవని ఆ విజ్ఞాపన పత్రంలో వివరించారు. హైకోర్టు ఏర్పాటుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో చర్చించి ముందుకెళ్దామని ఆ సమయంలో కేసీఆర్ కు రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేసీఆర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.