తెలంగాణకు ద్రోహంచేస్తున్న వారిని ద్రోహులనే అంటాం – కేసిఆర్

తెలంగాణకు ద్రోహం చేస్తున్న వారిని ద్రోహులు అనకపోతే మరేమనాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ ప్రశ్నించారు. టిఆర్ఎస్ భవనంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో షర్మిల పోల్చితే మరి ఆ పాకిస్థాన్‌లో జగన్ సభ ఎలా పెడుతారన్నారు. మరో మానుకోట కావాలని జగన్ కోరుకుంటున్నాడేమోనని కేసిఆర్ అన్నారు. జగన్ సభను తెలంగాణవాదులు అడ్డుకుంటారని కేసిఆర్ హెచ్చరించారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బిజేపి నాయకుడు దత్తాత్రేయ తనపై చైసిన వ్యాఖ్యలను కేసిఆర్ తప్పు పట్టారు. కేసీఆర్ ఫోటోను పెట్టి బాణాలు వదలడం, పాములతో కరిపిస్తున్నట్టు, కొడుతున్నట్టు సీమాంధ్రులు చూపిస్తున్నారని ఇది సంస్కారమా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఉస్మానియా విద్యార్థులను తాలిబన్లతో పోల్చినపుడు వారి సంస్కారం ఏమైందని కేసీఆర్ నిలదీశారు. తెలంగాణ ప్రజలను రాక్షసులు, గోచీ గాళ్లు అంటూ సీమాంద్రులు అన్నప్పడు వీరికి కనిపించలేదా అని కేసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణపై మాట మార్చిన చంద్రబాబు, హైదరాబాద్‌ను  పాకిస్థాన్‌తో పోల్చిన షర్మిల, తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న ముఖ్యమంత్రి సామాజిక తెలంగాణ అన్న చిరంజీవిలను ద్రోహులు అనక మరేమనాలని కేసిఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం వస్తోందని మౌనంగా ఉన్నామని మా మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దని కేసిఆర్ అన్నారు. బ్రిటీష్‌వారిని వలసవాదులు అన్నామని అయితే అది అక్కడి ప్రజలను అన్నట్లు కాదని కేసిఆర్ అన్నారు. ఇక్కడ కూడా దోపిడిదారులను మాత్రమే ద్రోహులని అన్నామని కేసిఆర్ అన్నారు. తాను ఎప్పుడూ ప్రజలను అనలేదని కేసిఆర్ అన్నారు. కేంద్రప్రభుత్వం  తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో వెంటనే ప్రవేశపెట్టాలని కేసిఆర్ డిమాండ్ చేసారు. లేకుంటే రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు మరింత పెరిగిపోయే అవకాశం ఉందన్నారు.

నవంబర్ 17 నుండి 25వ తేదీ మధ్యలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని కేసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రక్రియకు సీమాంద్ర ప్రజాప్రతినిధులు సహకరిస్తే సజావుగా సాగుతుందని కేసిఆర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.