తెలంగాణలో విద్యుత్ కొరత నివారణకు సత్వర చర్యలు

  • 3 ఏళ్ళలో మిగులు రాష్ట్రంగా నిలిపేందుకు సర్కార్ సంకల్పం
  • ఆంధ్రప్రదేశ్ నుంచి రావలసిన 1800 మోగావాట్ల కోసం ప్రయత్నం
  • నల్లగొండలో థర్మల్ విద్యుత్ భారీ ఉత్పత్తికై ప్రణాళిక
  • నిర్మాణంలోని ప్లాంట్లు పూర్తి చేసేందుకు కసరత్తు
  • భూపాలపల్లిలో 600 మోగావాట్ల విద్యుత్ కర్మాగారం పనులు ప్రారంభం

హైదరాబాద్, జనవరి 15: రాష్ట్ర ప్రభుత్వం రానున్న మూడేళ్ళలో విద్యుత్ కొరతలేని రాష్ట్రంగా నిలిచేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లతో పాటు కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుండి రావాల్సిన విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురానుంది.

గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొంది. దీనికి తోడు రాష్ట్రంలో విద్యుత్ కొరత రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది.  రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు రావాల్సిన కరెంట్ కూడ రాష్ట్రానికి సక్రమంగా అందలేదు. ఈ విషయమై ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో వచ్చే మూడేళ్ళలో రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అవసరాలను తీర్చేందుకు విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది మే నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. వారం రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విద్యుత్ ప్లాంట్ పనులను పరిశీలించారు. ప్రస్తుతం అక్కడే 500 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల రెండు ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనుల ప్రగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం బీహెచ్ ఇ ఎల్ తో ఆరువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఒప్పందం చేసుకున్నది. తొలివిడతలో రూ 350 కోట్లను రాష్ట్ర  ప్రభుత్వం బీహెచ్ ఇఎల్ కంపెనీకి గత మాసంలో చెల్లించింది. మూడేళ్ళలో ఆరు వేల  మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

ఎన్ టీపీసీ నుంచి కొత్తగా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పనులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి 1800 మెగా వాట్ల విద్యుత్ రాష్ట్రానికి రావాల్సి ఉంది. దీనికి తోడు మహబూబ్ నగర్ జిల్లాలో 1000 మెగావాట్ల  విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్  పవర్ పార్క్ ను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేయబోతుంది. ఇందులో నుంచి తెలంగాణకు 100 మెగావాట్లు విద్యుత్ లభించే అవకాశం ఉంది.

నల్లగొండ జిల్లా దామరచర్ల ప్రాంతంలో 7600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ పవర్ ప్లాంట్ల నిర్మాణం కోసం అనుమతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ధిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం పరస్పరం ఒప్పందం కుదుర్చుకొంది. ప్రస్తుతానికి చత్తీస్ ఘడ్ నుండి రాష్ట్రానికి విద్యుత్ లైన్లు లేవు. ఈ లైన్లు పూర్తైతే రాష్ట్రానికి చత్తీస్ ఘడ్ నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి రానుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం విద్యుత్ ప్లాంట్లు పూర్తైతే మూడేళ్ళలో రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీరే అవకాశం ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.