తెలంగాణ అసెంబ్లీ లో అధికార, విపక్షాల బాహాబాహి

governor-7

ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం రోజునే అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా స్పీకర్ పోడియం వద్దకు  వెళ్లేందుకు ప్రయత్నించిన విపక్షపార్టీ ఎమ్మెల్యేలపై అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డుతగిలారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు మార్షల్స్ లా  వ్యవహారించారని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

ప్రారంభం రోజునే తెలంగాణ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై దాడికి దిగారు. ఒకరిపై మరోకరు దాడులకు పాల్పడ్డారు ముష్టిఘాతాలకు దిగారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకోంది. గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ప్రసంగం కొనసాగే ముందు జాతీయగీతంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతం ప్రారంభం కాగానే విపక్ష సభ్యుల నుండి అరుపులు వినిపించడంతో గవర్నర్ జోక్యం చేసుకొని ఇది జాతీయ గీతం అని వారించగానే సభ ఆర్ఢర్ లోకి వచ్చింది.

గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, రేవంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పోడియం వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. టీడీపీ సభ్యులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడ జతకలిశారు. అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హారీష్ రావు సూచన మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియానికి రక్షణగా నిలిచారు. మార్షల్స్ తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడ జతకలిశారు. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు పోడియం వద్దకు చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించారు.

అధికార పార్టీ సభ్యులకు, విపక్ష సభ్యులకు తీవ్ర తోపులాట చేసుకొంది. రెండు వర్గాలు బాహాబాహీకి దిగారు. ముష్టిఘాతాలతో ఒకరిపై మరోకరు విరుచుకుపడ్డారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ పార్టీ ప్రజా ప్రతినిధులపై దాడికి దిగారని టిడిపి సభ్యులు ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల దాడితో తమ పార్టీకి చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ  పోట్ల నాగేశ్వర్ రావు లు గాయపడ్డారని టీడీపీ సభ్యులు చెబుతున్నారు. సభ సజావుగా జరగాలనే ఉద్దేశ్యంతోనే తాము విపక్ష సభ్యులను నిలువరించినట్టు అధికారపార్టీ సభ్యులు తెలుపుతున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించడానికే రక్షణ నిలిచినట్టు అదికారపార్టీ సభ్యులు చెబుతున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమపై అధికార పార్టీ సభ్యులు దాడికి దిగారని గాయపడిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెప్పారు.

ఇవాళ సభలో అధికారపక్షం వ్యవహారించిన తీరును విపక్షాలు తప్పుబట్టాయి. అధికార పార్టీ సభ్యులే మార్షల్స్ లా వ్యవహారించడం ఎప్పుడూ చోటుచేసుకోలేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ వ్యవహారించిన తీరు వల్లే ఈ పరిస్థితి నెలకొందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కేవలం 14 నిమిషాల్లోపుగానే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించాల్సి వచ్చింది. ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ సుమారు అరగంటకు పైగా ప్రసంగించారు. తెలంగాణ సభలో మాత్రం విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో 14 నిమిషాల్లోపుగానే ప్రసంగాన్ని ముగించుకొని వెళ్ళారు. గవర్నర్ సభ నుండి బయటకు వెళ్ళేటప్పుడు గవర్నర్ డౌన్ డౌన్ అంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. చివరకు గవర్నర్ కు మద్దతుగా అధికారపార్టీ సభ్యులు గవర్నర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.