తెలంగాణ తొలి బడ్జెట్

eetela-budget-11

తెలంగాణ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. గత ఏడాదితో పోలిస్తే రూ 15,052 కోట్ల మేరకు బడ్జెట్ పెరిగింది. బడ్జెట్ పెరిగినా బీసీలకు బడ్జెట్ లో కేటాయింపులపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్టు అధికార పార్టీ సభ్యులు చెబుతోంటే, ప్రజల ఆశలను నీరుగార్చే విధంగా ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కొత్త రాష్ట్రంలో తెలంగాణ తొలి బడ్జెట్ ను బుధవారం ప్రవేశపెట్టింది. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత ఏడాది రూ 1,00,637 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఏడాదికి గాను రూ 1,15,689 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. గత ఏడాది ప్లాన్ వ్యయంగా రూ 51,989 కోట్లను ప్రతిపాదించింది. ఈ ఏడాది నాన్ ప్లాన్ వ్యయం భారీగా పెరిగింది. నాన్ ప్లాన్ వ్యయం రూ 63,306 కోట్లకు పెరిగింది.

ఉద్యోగులకు వేతన స్థీరీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రతి ఏటా రూ 22,889 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. గత ఏడాది ప్లాన్ వ్యయం కింద రూ 48,648 కోట్లను ప్రతిపాదించగా, ఈ ఏడాదికి రూ 52,383 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది కేంద్రం నుండి రాష్ట్రానికి రూ 21,720 కోట్లు విడుదలవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొన్న నిర్ణయం కారణంగా కొన్ని పథకాలను రద్దు చేయడంతో ఈ ఏడాది రూ 12,400 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల రూపంలో సహాయం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గనుంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పథకాల స్థానంలో, ఆ పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నిదులను ఖర్చు చేయాల్సి రావండతో, ఈ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత ఆదాయ వనరులను ఈ ఏడాది గణనీయంగా పెంచుకోనున్నట్టు బడ్జెట్ లో ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే రూ 11,116 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోనున్నట్టు బడ్జెట్ లో ప్రతిపాదించింది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ 35,378 కోట్లు ఆదాయం వస్తోందని అంచనా వేసింది. ఈ ఏడాది రూ 46,494 కోట్లు ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం బడ్జెట్ లో అంచనాలను రూపొందించుకుంది. రెవిన్యూ మిగులు లో రూ 301 కోట్లను గత ఏడాది ప్రతిపాదించింది, ఈ ఏడాది రూ 531.30 కోట్లు రెవిన్యూ మిగులు ఉంటుందని బడ్జెట్ లో ప్రతిపాదించింది.

సంక్షేమ రంగాలకు ప్రభుత్వం బడ్జెట్ లో పెద్ద పీట వేసింది. ఆసరా పథకం కింద పెన్షన్ల పంపిణీ కోసం ప్రతి ఏటా రూ 3,637 కోట్లను ఖర్చు చేయనుంది. బీడి కార్మికుల సంక్షేమం కొరకు రూ 188 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

రాష్ట్ర జనాబాలో సగభాగంగా ఉన్న బీసీలకు బడ్జెట్ లో రూ 2,127 కోట్లను మాత్రమే కేటాయించడం పట్ల విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను బడ్జెట్ లో కేటాయించింది. ఎస్సీ ల సంక్షేమం కోసం రూ 6,154 కోట్లను, ఎస్టీ లకు రూ 2,878 కోట్లను, మైనార్టీలకు వెయ్యి కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి డబుల్ బెడ్ రూమ్ పథకం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ పథకానికి ఈ బడ్జెట్ లో కేవలం రూ 391.67 కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ కేటాయింపులతో ఎన్ని నిధులతో ఎన్ని ఇళ్ళు నిర్మిస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అదే విధంగా కేజీ టూ పీజీ విద్య పథకం పై కూడ బడ్జెట్ లో ఆశించిన మేర కేటాయింపులు జరగలేదు. ఈ విద్యావిధానానికి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లను మాత్రమే బడ్జెట్ లో కేటాయించింది. వంద కోట్లతో ఈ పథకం ఎలా అమలు చేస్తారనేది అనుమానాస్పదమే.

గజ్వేల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ కి రూ 50.38 కోట్లను, నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమం కింద రూ 240 కోట్లు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల భవనాల నిర్మాణానికి రూ 50 కోట్లను బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించింది. అదే విధంగా వాటర్ గ్రిడ్ కు రూ 4 వేల కోట్లను బడ్జెట్ లో కేటాయించింది. యాదగిరిగుట్ట అభివృద్ది కోసం వంద కోట్లను ఈ బడ్జెట్ లో కూడా కేటాయించింది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అమరుల పథకానికి రాష్ట్ర బడ్జెట్ లో రూ 90 కోట్లను కేటాయించింది. ఇరిగేషన్ సెక్టార్ కు రూ 7,633.85 కోట్లు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పునరుద్దరించేందుకు  రూ 866.15 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది భూముల విక్రయం ద్వారా రూ 6500 కోట్ల సమీకరించుకోవాలని భావించింది. అయితే కేవలం వెయ్యి కోట్లకు మాత్రమే ప్రభుత్వం చేరుకోగలిగింది. రానున్న రోజుల్లో భూముల విక్రయం ద్వారా రూ 13 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోనున్నట్టు ప్రభుత్వం అభిప్రాయపడింది. వ్యాట్ ట్యాక్స్ ను విధిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు సర్కార్ ప్రయత్నిస్తోంది. గత ఏడాది బడ్జెట్ అంచనాలతో ప్రతిపాదించినప్పటికీ, ఈ ఏడాది వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటున్నది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.