తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు

ghanta chakrapani-18

హైదరాబాద్, డిసెంబర్ 18: ఉద్యోగాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ తో పాటు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని, సభ్యులుగా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, మతీనుద్దీన్ ఖాద్రీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గురువారం సెక్రటేరియట్ లో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ గా ప్రమాణస్వీకారంచేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం లక్షకు పైగా ఉద్యోగాలు ఉన్నట్లుగా శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని చక్రపాణి తెలిపారు.

తెలంగాణలో ఇప్పటివరకు ఖాళీగాఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఎటువంటి ఒత్తిడులకు, ప్రలోభాలకు తావులేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో ఉద్యోగుల నియామకాలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.