తెలంగాణ బిడ్డల ఆశయం నెరవేరింది: కేసీఆర్

kcr-celebrating-telangana

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కావాలన్న తెలంగాణ బిడ్డల ఆశయం నెరవేరిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన, తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వార్త విన్న వెంటనే కేసీఆర్ ఢిల్లీలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ ఎంపీలు, పార్టీ ఎమ్మెల్యేలతో కలసి వచ్చి తెలంగాణ వాదులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలతో కలిసి ఆయన ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. ‘జై తెలంగాణ’ అంటూ కేసీఆర్ నినదించారు. తెలంగాణ ప్రజల అద్భుత పోరాటానికి ఫలితం వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి కృషి చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని సోనియా తెలంగాణ కలను సాకారం చేశారని ఆయన చెప్పారు.

తెలంగాణ పోరాటంలో తానిచ్చిన పిలుపునకు లక్షలాది మంది ప్రజలు స్పందించి కార్యక్షేత్రంలోకి వచ్చి పోరాటం చేశారని కేసీఆర్ చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఈ ఉద్యమంలో టీఆర్ఎస్ శ్రేణుల పాత్ర మరువలేనిదని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అడుగడుగునా కష్టాలు ఎదుర్కొన్నా ఉద్యమంలో చివరి వరకు పట్టు వదలకుండా పోరాడారని ఆయన చెప్పారు. తానిచ్చిన సూచన మేరకు పదవులను త్యజించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు, న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు, జర్నలిస్టుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ)లకు ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.