తెలంగాణ ముఖ్యమంత్రి సీటు కోసం కేసీఆర్ పావులు?

kcr

తెలంగాణ రాష్ట్ర ఆశయాన్ని సాధించుకున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పుడు కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావాలని అభిలషిస్తున్నారు. ఈ మేరకు కేసీఆర్ కాంగ్రెస్ అధినేత్రికి తన మనసులో మాట చెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సోనియా, దిగ్విజయ్ సింగ్ తో కేసీఆర్ సమావేశమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు తన మాటను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉండడంతో విలీనం ద్వారా తగిన ప్రయోజనం పొందాలనేది కేసీఆర్ చర్చల సారాంశంగా తెలుస్తోంది.

ఒకవేళ విలీనం చేయకపోతే కేసీఆర్ కు సీఎం సీటు, కాంగ్రెస్ కు ఎక్కువ ఎంపీ స్థానాలు ఇచ్చేలా రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలియవచ్చింది. తద్వారా ఇటు గులాబీ దళపతి కోరిక, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు వీలుంటుందనే వాదన ఉంది. అయితే, విలీనం చేస్తే ముందు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసి(టీసీసీ) దానికి చీఫ్ గా కేసీఆర్ ను నియమించవచ్చనే సమాచారం వినిపిస్తోంది. కేసీఆర్ చర్చల ఫలితం రానున్న రోజుల్లో స్పష్టంగా వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.