తెలంగాణ వాదానికి దూరంగా తెరాస పాలన

 • రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం లేదు, పరిహారం లేదు
 • దళితులకు భూమి పంపిణి దొరలకోసమే
 • ప్రశ్నలకు సమాధానం లాఠీ
 • పాత ప్రభుత్వాల దారిలోనే కొత్త సర్కార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో, ఆచరణలో తెలంగాణవాదపు విలువలు కూడ కనుమరుగవుతున్నాయని విశ్లేషిస్తున్నారు ఎన్ వేణుగోపాల్

N.Venugoapala Rao 1

ఎన్.వేణుగోపాల రావు, ఎడిటర్, వీక్షణం

తెలంగాణ రాష్ట్ర సమితి పాలన నాలుగు నెలలు తిరగకుండానే తన మౌలిక భూమిక అయిన తెలంగాణ వాదం నుంచి కూడ దూరమవుతున్నట్టు కనబడుతున్నది. తెరాస కూడ తెలంగాణ వాదాన్ని ఒక ప్రజాకర్షక, ప్రజామోద వాదంగా మాత్రమే ఎంచుకున్నదేమో, అధికారానికి వచ్చిన తర్వాత ఒక పాలక పార్టీగా పాలకవర్గ ప్రయోజనాలకు, అంటే ఆరుదశాబ్దాలుగా అమలులో ఉన్న ప్రయోజనాలకు అనుగుణంగానే పనిచేస్తున్నదేమో అనిపిస్తున్నది. అటువంటి అంచనాకు రావడానికి నాలుగు నెలల కాలం సరిపోదని అనుకునేవాళ్లు ఉండవచ్చు. కాని ఇప్పటి వరకూ ప్రభుత్వం చేపట్టిన పనులనూ, వాటి దిశనూ చూస్తే, భవిష్యత్తులో ఏవైనా గుణాత్మకమైన మార్పులు జరిగితే తప్ప, ఈ పాలన పాత పాలనల కొనసాగింపేనని, కొన్ని విషయాలలో పాతపాలనలను మించిపోతున్నదని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనబడుతున్నాయి.

తెలంగాణ వాదమంటే ఏమిటో కచ్చితంగా నిర్వచించుకుంటేగాని తెరాస ప్రభుత్వం దాన్ని ఎంతవరకు పాటిస్తున్నదో, ఎక్కడ దూరం జరిగిపోతున్నదో అర్థం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏమనుకుంటే అదే తెలంగాణ వాదం అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే తెరాస పుట్టడానికి ఐదు దశాబ్దాల ముందునుంచే తెలంగాణ ప్రజలలో తెలంగాణ వాదం ఉంది. తెరాస పుట్టినది 2001లో కాగా. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ ఆలోచనలు 1954లో ఫజలలీ కమిషన్ ముందుకు వచ్చిన వాదనలతో మొదలయ్యాయి. అలా ప్రారంభమైన తెలంగాణ వాదం 1956 పెద్దమనుషుల ఒప్పందంలో, 1957-68 ప్రాంతీయ మండలి వాదనలలో, 1969-72 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో, 1996లో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో అనేకరకాలుగా వ్యక్తమయింది. ఆ వాదానికి పార్లమెంటరీ రాజకీయ వేదిక మీద ఒక వ్యక్తీకరణగా 2001లో తెరాస ఏర్పడింది. ఆ తర్వాత పదమూడు సంవత్సరాలలో కూడ తెరాసతో పాటు వేరువేరు ప్రజాసమూహాలు, రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు తెలంగాణ వాదాన్ని ప్రకటిస్తూ, సవరిస్తూ, అభివృద్ధి చేస్తూ వచ్చారు. తాను పుట్టేనాటికే స్థిరపడి ఉన్న తెలంగాణ వాదానికి తెరాస పదమూడు సంవత్సరాల ఆచరణలో మార్పుచేర్పులు కూడ చేసి ఉండవచ్చు. మొత్తానికి ఈ ఐదు దశాబ్దాల చరిత్రలో తెలంగాణవాదం ఎన్ని వ్యక్తీకరణలు పోందినా, ఆ సూక్ష్మమైన తేడాలను పక్కనపెట్టి స్థూలంగా తెలంగాణ వాదం అని ఎవరైనా గుర్తించదగినదీ, అంగీకరించదగినదీ ఉంది. దాని ప్రకారం:

 • తెలంగాణ వనరులు (భూమి, నీరు, ఖనిజాలు, అడవులు) మొదట తెలంగాణ ప్రజలకే దక్కాలి
 • తెలంగాణ వనరులతో తెలంగాణ ప్రజలకు విద్యా, ఉద్యోగ, అభివృద్ధి అవకాశాలు, ప్రయోజనాలు దక్కాలి
 • తెలంగాణ వనరులను తెలంగాణేతరులు దోచుకోవడానికి అవకాశం ఉండగూడదు
 • తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు కావాలి
 • తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని భంగపరచగూడదు
 • తెలంగాణ ప్రజల సంస్కృతికి, చరిత్రకు, భాషకు, సాహిత్యానికి సముచిత గౌరవం దక్కాలి
 • పైవన్నీ సాధించాలంటే తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం, స్వయంనిర్ణయాధికారం, స్వయం పాలన కావాలి

ఇదీ ప్రధానంగా తెలంగాణ వాదం. కాని తెలంగాణ అనేది ఒక ఏకశిలాసదృశమైన ముద్ద కాదు. తెలంగాణలో భిన్న కులాలకు, మతాలకు, వర్గాలకు, భాషలకు, ప్రాంతాలకు చెందిన, వేరువేరు వనరుల లభ్యత స్థితిలో ఉన్న ప్రజలు ఉన్నారు. అందువల్ల ‘తెలంగాణ వాదం’ అస్పష్టమైనదీ, అనిర్ధిష్టమైనదీ అవుతుంది. ఆ వాదాన్ని మరింత అభివృద్ధి చేసి, మరింత నిశితంగా, సూక్ష్మస్థాయిలో నిర్వచించవలసి ఉంటుంది. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే మాకేమి వస్తుంది’ అని భిన్న సామాజికవర్గాల, కులాల, ప్రాంతాల, ఆదాయవర్గాల సమూహాలు ఉద్యమక్రమంలోనే ప్రశ్నలు లేవనెత్తడం మనకు తెలుసు. అప్పటి ఉద్యమ ఐక్యత అవసరాల దృష్ట్యా ఆ చర్చను తెలంగాణ వచ్చినతర్వాత చేయవచ్చునని వాయిదా వేయడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆ చర్చ విస్తృతంగా జరిగి, ప్రతి ప్రాంతానికీ, ప్రతి సామాజికవర్గానికీ, ప్రతి సమూహానికీ న్యాయమైన సమాధానం దొరికి ఉండవలసింది. ఆ పని ప్రారంభమే కాలేదు సరిగదా, అసలు ఆ అస్పష్ట, అనిర్దిష్ట తెలంగాణ వాదానికి కూడ భిన్నమైన, వ్యతిరేకమైన రాజకీయార్థిక పాలనా విధానాలు ప్రారంభమయ్యాయి.

Telangana agitation 1

(ఫైల్ ఫోటో)

స్థూలమైన తెలంగాణ వాదాన్ని వాస్తవికతలోకి అనువదిస్తే తెలంగాణలోని నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ భూమిపుత్రులకే దక్కాలని ఒక అర్థం చెప్పుకున్నాం. దాన్ని ఇంకా విస్తరించి తెలంగాణలోని భూమి తెలంగాణేతరులు కొల్లగొట్టగూడదని, ఆ భూమిని తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసమే వాడాలని, తెలంగాణ సహజ వనరులతో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ప్రథమ ప్రాధాన్యత తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడమే కావాలని, తెలంగాణ పాలనా విధానాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని, అణచివేతకు, విస్మరణకు గురైన తెలంగాణ సంస్కృతికి సముచిత స్థానం దక్కాలని అర్థం చెప్పుకున్నాం. తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన జలవనరుల వాటాను ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు తరలించారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ జలాలు తెలంగాణకే దక్కుతాయని, తద్వారా తెలంగాణ భూమి ఎక్కువగా సాగులోకి వచ్చి, తెలంగాణ రైతాంగ సమస్యలు తగ్గి, తెలంగాణ గ్రామీణ వికాసం జరుగుతుందని అనుకున్నాం. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ సహజవనరులను ఇతర ప్రాంతాలకు తరలించారని, ఇక్కడి వనరులను, ఖనిజాలను ఉపయోగించి ఇక్కడే పరిశ్రమలు పెట్టినప్పుడు కూడ ప్రాంతీయులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కలేదని, తెలంగాణ ఏర్పడితే తెలంగాణ ప్రజలకు అనుకూలమైన పారిశ్రామిక విధానం అమలవుతుందని, ఇక్కడి వనరులతో మరొక ప్రాంతం వారు లాభపడడానికి అంగీకరించబోమని, ఇక్కడి పరిశ్రమలు ఇక్కడివారికే ఉద్యోగాలు ఇస్తాయని అనుకున్నాం. ఉమ్మడి రాష్ట్ర పాలనా విధానాలు తెలంగాణ ప్రాంతీయులకు అన్యాయం జరిగేలా తయారయ్యాయని, తెలంగాణ ఏర్పడితే పాలనా విధానాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే తయారవుతాయని అనుకున్నాం.

ఇవన్నీ ఏవో కొన్ని సమూహాలు కన్న కలలు మాత్రమే కావు, ఇవాళ నిర్ణయాధికారం దక్కిన నాయకులలో ప్రతి ఒక్కరూ వందలాది సభలు, సమావేశాల్లో ఒకటికి పదిసార్లు చెప్పిన మాటలే. ఆ మాటలు చెప్పినవారికి అధికారం దక్కి నాలుగు నెలలు గడిచిపోయాయి. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రపు వారసత్వంగా వచ్చిన సమస్యలు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని లొసుగులు, ఇవాళ్టికీ కాచుకుని కూచుని మోసగించడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ వ్యతిరేకశక్తులు తెలంగాణ వాదాన్ని అమలు చేయడానికి ఆటంకాలను కల్పిస్తుండడం కూడ నిజమే. కాని ఆ ఆటంకాలను అధిగమించడానికి ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ ఆటంకాలను అధిగమించడానికి ప్రజలను భాగస్వాములను చేయడం జరుగుతున్నదా అని, ఆటంకాలు లేని చోట ఎటువంటి తెలంగాణ వాద విధానాలు అమలవుతున్నాయని ప్రశ్నించడానికి అవకాశం ఉంది.

ramoji rao

రామోజీరావు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజాప్రయోజనాలకు భంగకరమైన విధానాలు అమలయ్యాయని ఉద్యమక్రమంలో ఎన్నో సార్లు చెప్పిన పార్టీ అధికారానికి వచ్చినతర్వాత కనీసం పాత విధానాల సమీక్ష ప్రయత్నాలైనా మొదలుపెట్టలేదు. అనేకరంగాలలో పాత విధానాలనే యథాతథంగా కొనసాగిస్తున్నది. ప్రైవేటు రంగంలో, ప్రైవేటు వ్యక్తుల చేత, ప్రైవేటు పెట్టుబడులతో నడిచే పరిశ్రమలలో, సంస్థలలో, ప్రచార సాధనాలలో, వినోద సాధనాలలో తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని సమీక్షించడం సాధ్యం కాకపోవచ్చు. కాని ప్రభుత్వరంగంలో ఆరుదశాబ్దాలలో జరిగిన కార్యక్రమాల సమీక్ష జరిపి ఉండవచ్చు. భూపంపిణీ, భూకేటాయింపులు, నీటి వనరుల కేటాయింపులు, పరిశ్రమలకు రాయితీలు, సౌకర్యాలు, ఉద్యోగకల్పన, ప్రభుత్వ నిధుల కేటాయింపులు, ప్రభుత్వ పక్షాన జరిగిన సాంస్కృతిక, భాషా, చరిత్ర, కార్యక్రమాలలో సాగిన వివక్ష వంటివైనా సమీక్షించి ఎక్కడెక్కడ సవరించవలసిన అవసరం ఉందో పరిశీలించవచ్చు. ఈ సమీక్ష జరపకపోవడం ఒక ఎత్తయితే, పాత విధానాలనే యథాతథంగా కొనసాగిస్తుండడం మరొక ఎత్తు.

తెలంగాణ వనరుల దోపిడీలో ప్రధానమైనవి భూకేటాయింపులు, భూముల ఆక్రమణలు. రాచరిక భూస్వామ్య రాజ్యంగా హైదరాబాద్ రాజ్యంలో భూయాజమాన్యంలో తీవ్రమైన అసమానతలు ఉండేవి. లక్షలాది, వేలాది ఎకరాల పిడికెడు మంది భూస్వాములు ఒకపక్కన, భూమిలేని లక్షలాది నిరుపేద వ్యవసాయ కుటుంబాలు మరొక పక్కన ఉండేవి. 1948లో జరిగిన సైనిక చర్య తర్వాత రాజుకు చెందిన సర్ఫ్ ఎ ఖాస్ భూములు, పాయెగాలు, ఉమ్రాలు, జాగీర్లు, దేశముఖ్ లు, దేశపాండేలు, మక్తాదార్లు వంటి భూస్వాములలో కొందరి భూములు, ప్రధానంగా విదేశాలకు పారిపోయిన ముస్లిం ప్రభువర్గ సభ్యుల భూములు, వారసులు లేకుండా మిగిలిపోయాయి. వీటిలో కొన్ని చట్టబద్ధంగానే ప్రభుత్వాధీనంలోకి వచ్చాయి. కొన్ని వ్యక్తుల అక్రమ ఆక్రమణలోకి, కబ్జాలోకి వచ్చాయి. ప్రభుత్వాధీనంలోకి వచ్చినవి కూడ ఇష్టారాజ్యంగా అక్రమంగా కోస్తా, రాయలసీమ పెత్తందార్ల, రాజకీయ నాయకుల, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయి. అందువల్ల, 1948 గీటురాయిగా భూవివరాలను పరిశీలించి తెలంగాణలో అన్యాక్రాంతమైన, అక్రమ ఆక్రమణలో ఉన్న భూమి లెక్క తేల్చవలసి ఉంటుంది. అందుకు, సర్ఫ్ ఎ ఖాస్ రద్దు చట్టం, జాగీర్ల, ఇనాంల రద్దు చట్టం, కౌలుదార్ల రక్షణ చట్టం, గరిష్ట భూపరిమితి చట్టం, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం వంటి అనేక చట్టాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

అలా లెక్క తేలిన మిగులు భూమినంతా తెలంగాణ భూమిపుత్రులలో భూమిలేని నిరుపేదలకు, గృహవసతి లేని పేదలకు పంచవలసి ఉంటుంది. ఆ పని జరగకపోతే తెలంగాణ వాదపు ఆకాంక్ష నెరవేరినట్టు కాదు. ఒక ఉజ్జాయింపు లెక్క ప్రకారం, తెలంగాణలోని మూడు కోట్ల ఎకరాల భూమిలో కనీసం యాభై లక్షల ఎకరాలు ఇటువంటి  మిగులు భూమి ఉంటుంది. తెలంగాణలోని ఒక కోటి కుటుంబాలలో వ్యవసాయాధార కుటుంబాలు దాదాపు అరవై లక్షలు అనుకుంటే వారిలో భూమిలేని నిరుపేద కుటుంబాలు ఇరవై లక్షల లోపు ఉంటాయి. అంటే ప్రతి భూమిలేని కుటుంబానికీ రెండున్నర నుంచి మూడు ఎకరాల భూమి ఇవ్వడం సాధ్యమే, అది తెలంగాణ వాదంలో అంతర్భాగమే. అయితే ఆ పని జరగాలంటే మొట్టమొదట పాత విధానాల, పాత కేటాయింపుల సమీక్ష జరగాలి. అటువంటి పనిని తెరాస ప్రభుత్వం తలపెట్టినట్టు కూడ లేదు.

kcr-golconda 1

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  (ఫైల్ ఫోటో)

కాగా, దళిత కుటుంబాలకు మాత్రం మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తానని, అవసరమైతే కొని ఇస్తానని ప్రకటించిన తెరాస ప్రభుత్వం, ఆగస్ట్ 15న ప్రతీకాత్మకంగా ప్రారంభించి, అక్కడితో ఆపేసింది. జిల్లాల్లో భూములు ఎక్కడున్నాయో వెతకమని కలెక్టర్లను ఆదేశించింది. కలెక్టర్లు తమ తమ జిల్లాలలో వందా నూట యాభై ఎకరాలకు మించి ఎక్కడా లేదని నివేదికలు పంపారని వార్తలు వస్తున్నాయి. అంటే పాత అక్రమ కబ్జాలన్నిటినీ ఇప్పుడు ధ్రువీకరిస్తున్నారన్నమాట. ఇక భూమి కొని ఇవ్వడమంటే పాత చట్టాల ప్రకారం మిగులు భూములుగా తేలి, ప్రభుత్వానికి అప్పగించవలసిన భూములకు ప్రజాధనం నుంచి వెల చెల్లించడమన్నమాట. ఎప్పుడో వ్యవసాయం వదిలేసిన, వ్యవసాయేతర ఆదాయాలున్న వారికి, కేవలం తాతతండ్రుల ఆస్తిగా, అది కూడ గరిష్ట భూపరిమితి చట్టాల కింద ప్రభుత్వం ఎప్పుడో ఆక్రమించుకోవలసిన భూముల యజమానులకు ఇప్పుడు అదనపు సొమ్ము కట్టబెట్టడానికి ఈ భూపంపిణీ ఉపయోగపడుతుందన్నమాట. ఇది ఇక తమ చేతికి రాదని దొరలు ఇంతకాలం అనుకున్న భూమిని అమ్మిపెట్టే, ప్రజాధనం నుంచి అదనపు లాభం చేకూర్చే పనే తప్ప తెలంగాణ వాదంలో భాగమైన పని మాత్రం కాదు.

grandhi mallikarjuna rao

గ్రంధి మల్లికార్జున రావు, జి ఎం ఆర్

ఇక పట్టణ భూముల్లో, ముఖ్యంగా హైదరాబాద్ లోనూ, చుట్టూరా రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ భూముల్లో 1948 నుంచి ఇప్పటివరకూ జరిగిన రిజిస్ట్రేషన్లను సమీక్షిస్తే ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగనంతటి కుంభకోణాలు బయటపడతాయి. గురుకుల్ ట్రస్ట్ – అయ్యప్ప సొసైటీ, ఎన్ కన్వెన్షన్ సెంటర్ భూముల మీద ఒక చిన్న ప్రతీకాత్మక ప్రయత్నం చేసిన తెరాస ప్రభుత్వం అంతకు మించిన భూబకాసురుల, తిమింగిలాల జోలికి పోనేలేదు. నిజానికి ఇటువంటి అక్రమ ఆక్రమణల మీద చర్యలు తీసుకోదలచుకుంటే మొట్టమొదట ఆక్రమణదారుమీద, ఆ ఆక్రమణదారుకు సహకరించిన ప్రభుత్వాధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ ఆక్రమణదారు తెలివిగా ఎప్పుడో అమ్మివేయగా, ఇప్పటికి మూడో నాలుగో చేతులు మారి, తెలిసో తెలియకో కొనుక్కున్న మధ్యతరగతి గృహస్తుల మీద దాడులు చేస్తే అది సంచలన వార్త కావచ్చుగాని తెలంగాణ వాదం మాత్రం కాదు. రామోజీరావు, మురళీమోహన్, రామానాయుడు, సాంఘి కుటుంబం, రామలింగరాజు కుటుంబం, అంజిరెడ్డి, నార్నె, జనహర్ష వంటి భూబకాసుర తిమింగిలాలు ఆక్రమించుకున్న భూముల గురించి తెలంగాణవాదం మాట్లాడింది. చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి పందారం చేసిన వందల, వేల ఎకరాల భూముల గురించి మాట్లాడింది. ప్రత్యేక ఆర్థిక మండలాలు, విమానాశ్రయం, పరిశ్రమలు, వ్యాపారసంస్థలు, సినిమారంగం వంటి పేర్లతో ఆక్రమించుకున్న, ప్రభుత్వం నుంచి ఉచితంగానో, కారుచౌకగానో కొల్లగొట్టిన భూముల గురించి మాట్లాడింది. విమానాశ్రయం పేరుతో ప్రపంచంలో ఏ విమానాశ్రయానికీ లేనంత విశాలమైన ఐదువేల ఎకరాలు ఆక్రమించి, అందులో వెయ్యి ఎకరాలు విమానాశ్రయానికి వాడుకుని, మిగతాది రియల్ ఎస్టేట్ చేస్తున్న జి ఎం ఆర్ వంటి బడా భూస్వాముల గురించి మాట్లాడింది. ఇవాళ తెరాస ప్రభుత్వం వీరిలో ఏ ఒక్కరినీ ముట్టుకోకపోవడం మాత్రమే కాదు, వారి ఆక్రమణలో ఉన్న భూములను వారికే చట్టబద్ధంగా కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. సరిగ్గా చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డిల పద్ధతిలోనే ‘మూడు లక్షల ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి, రండి, రారండి’ అని దేశదేశాల సంపన్నులను, బహుళజాతి సంస్థలను, దళారీలను ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తున్నది.

rajiv gandhi international airport

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు, హైదరాబాద్

భూములు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి, పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి అని ప్రశ్నించేవాళ్లు ఉంటారు. అయితే నూట యాభై సంవత్సరాల భారత పారిశ్రామికీకరణ చరిత్రలో కనీసం నూట ముప్పై సంవత్సరాల పాటు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు భూమి ఇవ్వలేదు. పెట్టుబడిదారులు తమ లాభాల కోసమే పరిశ్రమలు పెడతారు గనుక వారికి ఉచితంగానో, చౌకగానో భూమి ఇవ్వనవసరం లేదనే ప్రభుత్వం భావించింది. పారిశ్రామికవేత్తలు తమకు వీలైన చోట్ల, అవసరమైన చోట్ల సొంతంగా భూమి కొనుక్కుని పరిశ్రమలు పెట్టుకున్నారు. అప్పటికన్న ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు వస్తున్నదేమీ లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అలా భూమి ఇవ్వవలసి వచ్చినా, ఆ పరిశ్రమ వల్ల స్థానిక సమాజానికి ప్రయోజనం ఉంటే, అంటే స్థానికులకు ఉద్యోగాలు వస్తే, స్థానిక ప్రజల అవసరాలు తీర్చే సరుకులు తయారు చేస్తే, స్థానిక ఆర్థికవ్యవస్థకు పుష్టి చేకూరిస్తే అలా భూమి ఇవ్వవచ్చునని అనుకోవచ్చు. కాని ఇవాళ తెలంగాణ భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిశ్రమలు, తెరాస ప్రభుత్వం భూములు ఇవ్వజూపుతున్న పరిశ్రమలు చూస్తే అవన్నీ ఉన్నతస్థాయి సాంకేతిక పరిశ్రమలు, ఎక్కువ ఉద్యోగాలు కల్పించని పరిశ్రమలు. అవేవీ స్థానికులకు ఉద్యోగ కల్పన చేసేవి కావు, స్థానిక సమాజ అవసరాలు తీర్చే ఉత్పత్తులు చేసేవి కావు. ప్రభుత్వం ఇవ్వజూపుతున్న పన్ను రాయితీల వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడ ఒరగబోయేదేమీ లేదు. ఇది చారానా దావత్ కు బారానా టాంగా కూడ కాదు, అసలు దావత్ కాదు, గంజినీళ్లు కూడ పోయదలచుకోని వాడికి జీహుజూర్ జోహుకుం అని సమాజ వనరులను అప్పనంగా అప్పగించడం.

girish sanghi

గిరీష్ సంఘి

మరి తెలంగాణ వాదంలో ప్రధానమైన అంశం తెలంగాణలో నిరుద్యోగాన్ని రూపుమాపడం, కనీసం తగ్గించడం. ఉమ్మడి రాష్ట్రంలో పన్నెండు లక్షల ప్రభుత్వోద్యోగాలలో, తెలంగాణ వాటాగా రావలసిన నాలుగున్నర లక్షల బదులు మూడు లక్షల మంది మాత్రమే ఉన్నారని, ఇక ప్రైవేటు పరిశ్రమల్లో, సంస్థల్లో కోస్తా, రాయలసీమ యజమానుల ఆధిపత్యం వల్ల లక్షలాది ఉద్యోగాలు స్థానికులకు దక్కకుండా పోయాయని, అందువల్లనే లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు నిరుద్యోగులయ్యారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందని ఉద్యమ క్రమంలో ఎందరో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం తెలంగాణ వాదంలో అతి ముఖ్యమైన అంశం. అందుకోసం ప్రభుత్వోద్యోగాలలో ఇంతకాలంగా తెలంగాణేతరులకు దక్కిన ఉద్యోగాలను తెలంగాణ బిడ్డలకు పునరుద్ధరించాలి. అందుకోసం తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి, ఉద్యోగ కల్పనా చర్యలు తీసుకోవాలి. డి ఎస్ సి ఏర్పాటు చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలు నింపాలి. తెలంగాణలో ప్రైవేటు రంగ సంస్థల మీద తెలంగాణ వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన విధించడానికి అవకాశం లేదు గనుక ప్రభుత్వ రంగ సంస్థలు విరివిగా ఏర్పాటు చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా మూసివేతకు, పెట్టుబడుల ఉపసంహరణకు గురైన సంస్థలను పునరుద్ధరించాలి. తెలంగాణ సమాజం నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టిన పరిశ్రమల స్థాపన అవకాశాలు అన్వేషించాలి. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగి ఉండవలసిన ఈ పనుల్లో ఒక్కటీ ప్రారంభం కూడ కాలేదు. బహుళ జాతి సంస్థలకు, దేశవ్యాపిత బడా, దళారీ పెట్టుబడిదారీ సంస్థలకు ఆహ్వానాలు అందుతున్నాయి గాని నిరుద్యోగ సమస్యను పరిష్కరించే పనులు ప్రారంభం కాలేదు. మూతబడిన పరిశ్రమల పునరుద్ధరణ మాటలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తామనే మాట లేదు. టిపిఎస్ సి గురించి డిఎస్ సి గురించి ప్రకటనలే తప్ప ముందడుగులు లేవు. రాయితీల విషయంలో కనీసం తెలంగాణ పెట్టుబడిదారులకు, తెలంగాణ ఎన్ ఆర్ ఐ లకు ఆహ్వానాలు లేవు. అంటే పాత పారిశ్రామిక విధానానికి భిన్నమైన, తెలంగాణ వాదానికి అనుగుణమైన చర్యలు లేవు.

తెలంగాణవాదానికి అనుగుణంగా కాకపోయినా పరిశ్రమల ఏర్పాటు గురించి ఎంతో కొంత ఆర్భాటం జరుగుతున్నది గాని వ్యవసాయ రంగం గురించి ఆ మాత్రం కదలిక కూడ లేదు. తెలంగాణ వ్యవసాయ రంగానికి ఈ సంవత్సరం అదనపు కష్టంగా వర్షాభావ సమస్య ఏర్పడింది. పాత ప్రభుత్వాల వారసత్వంగా విద్యుచ్ఛక్తి సమస్య ఉండనే ఉంది. ఇటువంటి సమయంలో రైతాంగాన్ని, గ్రామీణ ప్రజానీకాన్ని ఆదుకోవడానికి, కనీసం ఆశ్వాసం ఇవ్వడానికి ప్రయత్నించవలసిన తెరాస ప్రభుత్వం కనీసం ఆ పని కూడ చేయడం లేదు. నాలుగునెలల్లో మూడు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్యలే శరణ్యమని అనుకున్నారంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని ఇంతకాలంగా చెపుతూ వచ్చిన మాటకు అర్థం లేదన్నమాట. రోజుకు ఇద్దరు ముగ్గురుగా పిట్టల్లా రాలిపోతున్న తెలంగాణ రైతు బిడ్డలకు ఆత్మవిశ్వాసమైనా ఇవ్వలేని తెరాస ప్రభుత్వం పాత ప్రభుత్వాల లాగనే ఆత్మహత్యలకు ఇతర కారణాలు వెతకడానికి ప్రయత్నిస్తున్నది. తెలంగాణ బిడ్డల మరణాల పట్ల ఇంత మొరటు వైఖరి తెలంగాణ వాదంలో భాగమేనా?

no rain

(ఫైల్ ఫోటో)

తెలంగాణ ప్రధానంగా గ్రామీణ, వ్యావసాయిక సమాజం. హైదరాబాద్ పట్టణంగా ఎదిగినా గ్రామీణ మానవ సంబంధాలను పూర్తిగా వదులుకొని నగర సంస్కృతిని అలవరచుకున్నది కాదు. తెలంగాణ వాదం ప్రత్యక్షంగా ప్రకటించినా ప్రకటించకపోయినా ఈ గ్రామీణ నైసర్గిక సహజ మానవసంబంధాల సంస్కృతిని ఎత్తిపట్టింది. కాని తెరాస ప్రభుత్వం సరిగ్గా చంద్రబాబు నాయుడు లాగ భావజాల స్థాయిలోనే గ్రామీణ సంస్కృతి నుంచి దూరమైన పట్టణీకరణ గురించి మాట్లాడుతున్నది. నగరాలను, స్మార్ట్ నగరాలను సృష్టించడానికి వెంపరలాడుతున్నది. నగరాలలో దొరికే సౌకర్యాలతో సమానమైన సౌకర్యాలను అందించి గ్రామాలను అభివృద్ధి చేస్తామనే నమూనాను అవలంబించవలసిన చోట, గ్రామీణులందరినీ పట్టణాలకు తీసుకువస్తామనే లేనిపోని ఊహలు ప్రకటిస్తున్నది. ఇది తెలంగాణ సమాజానికీ, తెలంగాణ వాదానికీ వ్యతిరేకమైన, విధ్వంసకరమైన ఆలోచన.

అలాగే ఉమ్మడిరాష్ట్రంలో విద్యారంగంలో తెలంగాణ కోల్పోయిన హక్కులను పునరుద్ధరించడం, అంటే శ్రీచైతన్య-నారాయణ నమూనా విద్యావ్యవస్థకు భిన్నమైన విద్యావ్యవస్థను అందించడం తెలంగాణవాద ఆకాంక్ష కాగా, తెరాస ప్రభుత్వం కొంత నేరుగానూ, కొంత దొడ్డిదారినా అదే మార్గంలో నడుస్తున్నది. ఉద్యమంలో పాల్గొన్న ప్రజలను, విద్యార్థులను, తెలంగాణ సమాజాన్ని ఆకర్షించడానికి కెజి నుంచి పిజి ఉచిత విద్య, కామన్ స్కూల్ పద్ధతి వంటి ఆకర్షణీయమైన మాటలు కోటలు దాటుతున్నాయి గాని అడుగులు కార్పొరేట్ విద్యవైపే పడుతున్నాయి.

కీలకమైన ప్రభుత్వోద్యోగాలలో తెలంగాణ వారిని ఉద్దేశపూర్వకంగా నియమించడం లేదని, లేదా తెలంగాణ వ్యతిరేకులను ఉద్దేశపూర్వకంగా నియమిస్తున్నారని, ప్రభుత్వం ద్వారా జరిగే పనులను కోస్తా, రాయలసీమల సంపన్నులు, రాజకీయనాయకులు, పైరవీకారులు తన్నుకుపోతున్నారని ఉమ్మడి రాష్ట్రం రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులందరమూ వాదించేవాళ్లం. ఇటువంటి పనులను ఖండించడమే, జరగనివ్వకపోవడమే తెలంగాణ వాదమని భావించాం. నాలుగు నెలల తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఆ పాత పద్ధతులు రోజురోజుకూ పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు. తెలంగాణ ఉద్యమం మీద పనిగట్టుకుని దమనకాండ సాగించిన, తెలంగాణ పట్ల ద్వేషాన్ని బహిరంగంగా ప్రకటించిన పోలీసు అధికారులు ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ కోరుకున్నప్పటికీ తెలంగాణకు కేటాయించబడి, ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి విశ్వసనీయ అధికారులుగా కనబడుతున్నారు. వారు ప్రవహింపజేసిన తెలంగాణ బిడ్డల నెత్తురు విలువ ఏమిటి? అవసరం లేకపోయినా పోలీసులకు వాహనాలు కొనాలని తెరాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ జపనీస్ కంపెనీ కన్న ఎక్కువగా స్థానిక డీలర్, పచ్చి తెలంగాణ వ్యతిరేకి వెంకయ్య నాయుడు కొడుకుకే ప్రయోజనకరమని తెలిసినా ఆ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ వాదంలో ఎలా భాగమవుతుంది? ఇతర రాష్ట్రాలలో ప్రజా ఉద్యమాల వల్ల స్థాపించలేకపోయిన కాలుష్యకారక, పర్యావరణ నష్టదాయక, ప్రమాదకర పరిశ్రమలను, సంస్థలను రారమ్మని పిలవడం తెలంగాణ సమాజానికి ఏమి మేలు చేయడానికి? అది తెలంగాణవాదంలో ఎలా భాగమవుతుంది?

on road 1

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై పడుకొని నిరసన తెలుపుతున్న విద్యార్థులు (ఫైల్ ఫోటో)

తెలంగాణవాదం ఆరుదశాబ్దాల పాటు తన ప్రజాస్వామిక హక్కులను, రాజ్యాంగబద్ధ హక్కులను పోగొట్టుకుంది. తన హక్కులను సాధించుకోవడం కోసం పోరాడింది. అటువంటి ఉద్యమ పునాదుల మీద అధికారానికి వచ్చిన ప్రభుత్వం ప్రజల హక్కుల పట్ల ఎంత సున్నితంగా, సమన్వయ అవగాహనతో వ్యవహరించవలసి ఉంటుందో తెరాస ప్రభుత్వం అలా మాత్రం వ్యవహరించడం లేదు. అంటే అది తెలంగాణ వాదానికి, తెలంగాణవాదపు విలువలకు కచ్చితంగా దూరమవుతున్నట్టే. హక్కులను అణచిపెట్టడం ద్వారా ప్రశ్నలను రద్దుచేయడం సాధ్యం కాదని, అణచివేతవల్ల ఆ ప్రశ్నలు మరింత బలం సంతరించుకుంటాయని, చివరికి విస్ఫోటక శక్తిగా మారుతాయని తెలంగాణ ఉద్యమమే రుజువు చేసింది. బ్రహ్మానందరెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఎందరెందరు తెలంగాణ వ్యతిరేకులు ఎంత అణచివేత ప్రయోగించినప్పటికీ తెలంగాణవాదాన్ని రూపుమాపలేకపోయారు. ప్రజల ప్రశ్నలకు వారందరూ ఉపయోగించిన ఏకైక సమాధానం పోలీసు లాఠీ, తుపాకి, దమననీతి. ఆ దమననీతిని అనుభవించిన తెలంగాణ వాదం తనకు ఎదురైన ప్రశ్నల మీద అదే దమననీతిని ప్రయోగిస్తే అది తెలంగాణ వాదమే కాజాలదు. సంభాషణ, చర్చ, వాదన, సమన్వయం, మధ్యవర్తుల, పెద్దమనుషుల జోక్యం, ఇచ్చి పుచ్చుకోవడం, ప్రజాస్వామికంగా వ్యవహరించడం, రెండడుగులు ముందుకు వేయడానికి ఒక అడుగు వెనక్కి వేయడం తెలంగాణ వాదం నేర్పిన విలువలు. కాని తెరాస ప్రభుత్వం ఈ విలువలన్నిటినీ పక్కనపెట్టి పాత ఉమ్మడి రాష్ట్ర పాలకుల లాగనే ప్రతిదానికీ పోలీసు లాఠీని, దమననీతిని ఉపయోగిస్తున్నది, తుపాకిని ఉపయోగించే రోజు ఎక్కువ దూరంలో లేకపోవచ్చు.

lecturers 1

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జీ (ఫైల్ ఫోటో)

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ న్యాయసమ్మతంగా జరగాలని, పాత అక్రమాలను ధ్రువపరచేదిగా, నిరుద్యోగాన్ని పెంచేదిగా జరగగూడదని అడిగిన విద్యార్థులకు, నిరుద్యోగులకు సమాధానం లాఠీ. విత్తనాలు కావాలని, ఎరువులు కావాలని, విద్యుత్తు కావాలని అడిగిన రైతులకు సమాధానం లాఠీ. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న కోరికలను నెరవేర్చమని అడిగిన జూనియర్ డాక్టర్ల మీద లాఠీ. ఊరేగింపుకూ, బహిరంగ సభకూ అనుమతి ఇవ్వకపోతే కనీసం హాలులో కూచుని మాట్లాడుకుంటామని అడిగితే హాలుకు అడ్డంగా లాఠీ. ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఇవాళ అధికారానికి వచ్చిన, నిన్నటిదాకా ఉద్యమం నడిపిన రాజకీయ పక్షమా, లేక పోలీసులా? పోలీసులే అయినా, ప్రభుత్వమంటే పోలీసులే అని చెప్పదలచినా అది కచ్చితంగా తెలంగాణవాదం కాదు. ఒక ప్రజాసమూహం వేసిన, వేస్తున్న ప్రశ్నలన్నీ సమంజసమైనవే కాకపోవచ్చు, వాటిలో అంగీకారయోగ్యమైనవీ, కానివీ కూడ ఉండవచ్చు. అధికారంలో ఉన్నవారు ఆ ప్రశ్నలు వేసేవారితో ఓపికగా చర్చ జరిపి పరిష్కారానికి మార్గం సుగమం చేయవలసిందే తప్ప, లాఠీ ఝళిపించి నోరు మూయిస్తామంటే, ఇవాళ మూతబడిన నోరు రేపు మరొక రూపంలో పేలుతుంది. తెలంగాణ ప్రతీకలలో కొన్నిటిని ఆడంబరంగా ఎత్తిపడుతూ, ఇంతకాలం విస్మరణకు గురైన బోనాలు, బతుకమ్మ, కొమురం భీం, కాళోజీ, యాదగిరిగుట్ట వంటి సాంస్కృతిక ప్రతీకలకు స్థానం దొరుకుతున్నదనే సంతోషం కలిగించినంత మాత్రాన తెలంగాణవాదపు మౌలిక ప్రశ్నలు మరుగున పడిపోవు.

kcr 4-1

(ఫైల్ ఫోటో)

ఇలా తెరాస ప్రభుత్వ చర్యలలో కొన్నయినా స్పష్టంగా తెలంగాణ వాదం నుంచి దూరమైనవిగా కనబడుతుండగా, వాటిని లేవనెత్తిన వారి మీద విరుచుకుపడే ఒక కొత్త ‘తెలంగాణవాదుల’ బృందం తయారయింది. తెలంగాణవాదపు ఐదు దశాబ్దాల చరిత్ర గాని, తెలంగాణ వాదపు విశాల ఆకాంక్షలు గాని, ప్రజాస్వామిక స్వభావం గాని తెలియని ఈ బృందం ప్రభుత్వ విధానాలను విమర్శించే వారందరినీ తెలంగాణ ద్రోహులని, ప్రతిపక్ష పార్టీల సమర్థకులని, కోస్తాంధ్రులకు అమ్ముడుపోయారని ఆరోపిస్తున్నది. తెలంగాణ వాదపు భూమిక నుంచే విమర్శించడానికి ఎన్నో అవకాశాలను ప్రభుత్వ విధానాలే, ఆచరణే ఇస్తున్నాయి. ఆ విధానాలను ఆచరణను విమర్శించడం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ ద్రోహం కాదు. ఈ తెలంగాణ వ్యతిరేక చర్యలను సమర్థిస్తున్నవారే తెలంగాణ ద్రోహులవుతారు. ఇక కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ వంటి ప్రతిపక్షపార్టీలలో ఏ ఒక్కదానికీ తెరాసను విమర్శించే, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే నైతిక అర్హత లేదని కొత్తగా చెప్పనక్కరలేదు. ఇంతకాలం తెలంగాణను విమర్శించిన, ద్రోహం చేసిన, చివరికి పార్లమెంటులో, బిల్లు తయారీలో మోసం చేసిన ఆ ప్రతిపక్ష పార్టీలు ఇవాళ శవాలమీద పేలాలు ఏరుకోవడానికి ప్రయత్నిస్తుండవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకంగా కనబడుతూ, ప్రజల ఇక్కట్ల పట్ల మొసలికన్నీరు కారుస్తుండవచ్చు. కాని ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ వాదం పక్షాన తెరాస విధానాలను విమర్శించే వారికి ఆ ప్రతిపక్షాలతో గాని, కోస్తాంధ్ర, రాయలసీమ స్వార్థపరశక్తులతో గాని ఏ సంబంధం లేదు. అటువంటి తప్పుడు ఆరోపణలతో, నిందలతో అసలు వాస్తవాల్ని మసిపూసి మారేడుకాయ చేయడం సాధ్యం కాదు.

(వీక్షణం నవంబర్ 2014 సంచిక నుంచి)

Have something to add? Share it in the comments

Your email address will not be published.