తెలుగువారి గుండె చప్పుడే ‘జై సమైక్యాంధ్ర’: కిరణ్

Jai-samaikyandhra

రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త పార్టీ అయిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ బ్యానర్ ను ఆ పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సభ్యులను వెళ్లగొట్టి, చేయి చేసుకుని బిల్లును ఆమోదించారని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ అన్నారు. అసెంబ్లీ తిప్పి పంపిన బిల్లును పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు. విభజనను వ్యతిరేకించే తాను ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. రాజమండ్రిలో జరిగిన పార్టీ తొలి సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ విభజనకు సహకరించాయని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలని ఏ నివేదిక సిఫార్సు చేయలేదని తెలిపారు. ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించారని ఆయన ప్రశ్నించారు.

తాను సీఎం అయ్యాకే రాష్ట్రంలో ఏ లోటూ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని కిరణ్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం, రైల్ రోకోలు, నిరసనలు ఉన్నా రైతులకు, మహిళలకు లబ్ది చేకూరేలా కార్యక్రమాల్ని కొనసాగించామని తెలిపారు. ఇద్దరు బాబులు… చంద్రబాబు (పెదబాబు), జగన్ బాబు (చినబాబు)లు విభజన చేయాలని లేఖలు ఇచ్చారని… ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అక్కడ పెద్దమ్మ సోనియా, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ లు విభజించారని మండిపడ్డారు. ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అధికార పార్టీ కాంగ్రెస్ తో ఎలా కుమ్మక్కు అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది అత్యంత నీతిబాహ్యమైన చర్య అని కిరణ్ అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.