త్రాగునీరు అందిస్తాం : కేటీఆర్

ktr-kmm-29

ఖమ్మం: విలేకరు సమావేశంలో మాట్లాడుతున్న పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి కే.తారకరామారావు

ఖమ్మం, జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గొంతుకకు రక్షిత త్రాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో నిర్ధిష్ట కాలపరిమితో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన వాటర్ గ్రిడ్ (జలజాలం) పథకంను సాహసోపేత నిర్ణయంగా రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి కే.తారకరామారావు అభివర్ణించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, జలజాలంపై మంత్రి కేటీఆర్, రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కలెక్టర్ ఇలంబరిది, జడ్పీపిపి చైర్ పర్సన్ కవిత తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో గోదావరి, కృష్ణా నదీపరివాహక ప్రాంతాలు ఉన్నాయని, ఈ రెండు నదుల ఆధారితంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి వచ్చే 4 సంవత్సరాల్లో పూర్తిచేస్తామన్నారు. పాలేరు, వైరా రిజర్వాయర్, గోదావరి మీద ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టకు ప్రధాన నీటి వనరులుగా గుర్తించామన్నారు. వైరా రిజర్వాయర్ జీవ రిజర్వాయర్ గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. నాగార్జునసాగర్ ప్రధాన కాలువ వైరా రిజర్వాయర్ కు అనుసంధానించి, దాని ద్వారా వచ్చే నీటితో నింపడంవల్ల వైరా ప్రాంత రైతుల సుదీర్ఘమైన కోరిక నేరవేర్చినట్లవుతుందన్నారు.

రాబోయే 2 సంవత్సరాల్లో జిల్లాలో రూ 1000 కోట్ల విలువైన పంచాయితీరాజ్, రోడ్లు భవనాల శాఖ ద్వారా నూతన రోడ్లు, అంతర్గత రోడ్లు, రోడ్ల మరమ్మత్తులు చేపడతామన్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు గల రోడ్డును 4 వరుసల రహదారిగా విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆసరా పింఛన్ల పథకం ద్వారా జిల్లాలో గతంలోకంటే 30 వేల పింఛన్లను అదనంగా అందించి, దీనికై నెలకు రూ 26 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.

ప్రభుత్వ పేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల వివాహాలకు ఆర్ధిక సహాయం అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాలపై జిల్లా ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉందన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 95 దరఖాస్తులు మాత్రమే రావడం ఇందుకు నిదర్శమన్నారు. ఈ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజన జాతుల వారు 50 సంవత్సరాలు నిండితే వృద్ధాప్య ఆసరా పింఛన్లు అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలోనే గ్రామీణ మహిళల జీవనోపాధి మెరుగుపరిచి తద్వారా జీవన ప్రమాణాలను మెరుగు పరచేందుకు తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంను చేపడామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.