దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి – చంద్రబాబు

నిజాయితీతో కూడిన రాజకీయాలు నేడు లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అనే తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యానికి మనసా, వాచా కట్టుబడిన పార్టీలు వైఎస్సార్ సిపి, సిపిఎం, ఎంఐఎం అని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

తెలంగాణ పేరు చెప్పి కేసిఆర్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, జగన్ తెలంగాణపై మాటమార్చి, సమైక్య ముసుగులో సీమాంధ్ర విభజనకోసమే పనిచేస్తున్నాడని చంద్రబాబు అన్నారు.

వైసీపీకి, కాంగ్రెస్‌కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది కాబట్టే జగన్‌కు బెయిల్ దొరికిందని లేకపోతే ఆయన ఇప్పటికీ జైలులోనే ఉండాల్సి వచ్చేదని చంద్రబాబు తెలిపారు. జగన్ బెయిల్ విషయంలో సీబీఐ రాత్రికి రాత్రి మాట మార్చి తెల్లారే సరికి బెయిల్ ఇస్తే అభ్యంతరం లేదని కోర్టుకు చెప్పారన్నారు. కాంగ్రెస్‌తో వైసీపీ లాలూచీ పడిందనటానికి ఇదే నిదర్శనమన్నారు. జగన్ ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కూడా యూపీఏతో ఒక్కసారి కాదు వందసార్లు పొత్తుపెట్టుకుంటామని బాహాటంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆల్మట్టి ఎత్తు పెంచడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కారణమని చంద్రబాబు అన్నారు. కొత్తగా వేసిన ట్రిబునల్లో ఆర్గుమెంట్ చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నియమించిన అడ్వకేట్ సరైన రీతిలో ఆర్గ్యుమెంట్ చేయలేకపోవడం మూలానా క్రిష్ణా నదీజలాలు మనకు రాకుండా పోయాయన్నారు. మాట మార్చడం, యూటర్న్ తీసుకోవడం వైసీపీకి అలవాటేనని దుయ్యబట్టారు.

17 సంవత్సరాల పాటు సాగిన గడ్డి కుంభకోణం కేసు విచారణలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు జగన్నాధ్ మిశ్రా, జగదీష్ శర్మ, 4 ఐఏఎస్ అధికారులతోపాటు 45 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. అదే విధంగా మెడికల్ సీట్ల కుంభకోణం కేసులో అప్పటి వైద్య శాఖ మంత్రి రషీద్ మసూద్ ను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారిస్తూ శిక్ష విధించింది. కొంత ఆలస్యమైనప్పటికి న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయనడానికి లాలూ ప్రసాద్ యాదవ్, రషీద్ మసూద్ కేసులో తీర్పులే నిదర్శనమని ఆయన తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.