దళితులకు రాజ్యాంగ రక్షణకోసం అంబేద్కర్ పోరాటం

  • అనేక అంశాలలో గాంధీ, పటేల్ లతో విభేదాలు.
  • అంటరానివారి ప్రతినిధిగా రౌండ్ టేబిల్ సమావేశంలో వాదన.
  • పుణె ఒప్పందంతో గాంధీ ఆంతర్యం వెల్లడి.
  • ఎస్ ఆర్ శంకరన్ స్మారకోపన్యాసంలో ఉండ్రు రాజశేఖర్.

హైదరాబాద్, అక్టోబర్ 26: దళితులకూ, ఆదివాసులకూ రాజ్యాంగ రక్షణలు కల్పించేందుకు  బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి అనన్య సామాన్యమైనదనీ, ఈ రోజున దళితులూ, ఆదివాసులో  ఈ మాత్రమైనా హక్కులు అనుభవిస్తున్నారంటే, ఇంతమాత్రమైనా అభివృద్ధి చెందారంటే అందుకు అంబేద్కర్ దార్శనికతే కారణమని అన్నారు.

undru rajasekhar

ఎస్ ఆర్ శంకరన్ నాలుగవ స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర ప్రభుత్వాధికారి డాక్టర్ ఉండ్రు రాజశేఖర్

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారంనాడు ఎస్ ఆర్ శంకరన్ నాలుగవ స్మారకోపన్యాసం చేస్తూ కేంద్ర ప్రభుత్వాధికారి, అంబేద్కర్ సిద్ధాంతాలను అధ్యయనం చేసిన  డాక్టర్  ఉండ్రు రాజశేఖర్,  జనాభా ప్రాతిపదికన  రాజకీయ ప్రాతినిధ్యం  దళితులకు దక్కాలని అంబేడ్కర్ జీవితాంతం పోరాడారని అన్నారు. జాతీయ నాయకులైన గాంధీ, సర్దార్ వల్లభ బాయ్ పటేల్ తో ముఖ్యమైన విషయాలపై విభేదించారని రాజశేఖర్ తెలిపారు. రాజ్యాంగసభ చర్చల సందర్భంగా  రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్స్ పై  తీవ్ర చర్చలు జరిగినట్లు, చివరికి అప్పటికే వున్న ఇతర రిజర్వేషన్స్ అన్నింటిని రద్దుపరచి, యస్.సి, యస్.టి  రిజర్వేషన్స్ మాత్రం కొనసాగటానికి ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. అంబేద్కర్ ఆలోచన ప్రకారం దళితులకు ప్రత్యేకంగా చట్టసభలలో ప్రాతినిధ్యం వుండాలని, వారిని దళిత ప్రజలే ఎన్నుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారని చెప్పారు. అప్పుడు మాత్రమే దళిత ప్రజాప్రతినిధులు దళితుల అభివృద్ధికి, స్వావలంబనకు పాటు పడతారని అంబేడ్కర్ భావించారని  రాజశేఖర్ పేర్కొన్నారు.

chukka ramaiah and others

కార్యక్రమంలో పాల్గొన్న చుక్కా రామయ్య, కాకిమాధవరావు, కేఆర్ వేణుగోపాల్ తదితరులు

రాజ్యాంగ నిర్మాణం సమయంలో ఎక్కువగా అంబేద్కర్ దేశీయాంగ మంత్రి వల్లభ్ భాయ్ పటేల్ తోనే సమాలోచనలు జరిపేవారనీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎక్కువగా ప్రభుత్వ నిర్వహణలో నిమగ్నమై ఉండేవారని రాజశేఖర్ అన్నారు. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి చేసి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత రాజకీయాలో ప్రవేశించి సమాజంపైన తన ముద్రవేయడానికి ప్రయత్నించారనీ, అప్పుడు ఆయనకు అవరోధంగా నిలిచినవారిలో గాంధీజీ ఒకరనీ చెప్పారు. చట్టసభలలో అంటరానివారికి ప్రత్యేక సభ్యత్వం కల్పిస్తే వారు ముస్లింలతోకలిసి హిందువులపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందని గాంధీ భావించారనీ, ఈ విషయం గాంధీ కార్యదర్శి దేశాయ్ గుజరాతీలోరాసుకున్న డైరీలో ఉన్నట్టు వెల్లడైందని రాజశేఖర్ అన్నారు.  1931లో లండన్ లో రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అంటరానివారికి ప్రతినిధిగా అంబేద్కర్ ను పరిగణించడం గాంధీకి ఇష్టం లేకపోయిందనీ, అంటరానివారితో సహా భారతీయులందరికీ తానే ప్రతినిధిననే అభిప్రాయం ఆయనకు ఉండేదనీ, కానీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం అంబేద్కర్ ని అంటరానివారి ప్రతినిధిగా అంగీకరించిందనీ తెలియజేశారు. పుణె ఒప్పందం పూర్వాపరాలను కూడా రాజశేఖర్ వివరించారు.

చట్టసభలలో దళితులకూ, ఆదివాసులకూ రిజర్వేషన్లు పది సంవత్సరాలపాటు మాత్రమే ఉంటాయనీ అంబేద్కర్ భావించానీ,  ఆ తర్వాత రిజర్వేషన్లు ఉండకపోతే దళితుల రాజకీయ భవితవ్యం ఎట్లా ఉంటుందనే అంశం ఆయనకు ఆందోళన కలిగించేదనీ చెప్పారు. రెండో సార్వత్రిక ఎన్నికలకు ముందే అంబేద్కర్ నిర్యాణం జరిగినప్పటికీ రాజ్యాంగం హామీ ఇచ్చిన రిజర్వేషన్లను నెహ్రూ, ఇందిరాగాంధీ, తదితరులు పొడిగిస్తూ వచ్చారనీ, ఇప్పుడు చట్టసభలలో కానీ ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్లను అంతం చేయాలనే చర్చ జరగడం లేదని ఉండ్రు వివరించారు.

శంకరన్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం : రామచంద్రమూర్తి

dr k ramachandra murthy

ఎస్ ఆర్ శంకరన్ నాలుగవ స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కె.రామచంద్ర మూర్తి

అణగారిన వర్గాలపట్ల శంకరన్ కు  అపారమైన ప్రేమ ఉండేదని, దళిత వర్గాల అభివృద్ధికి ఆయన నిరంతర కృషి చేశారని సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్ర మూర్తి అన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన ఎస్.ఆర్.శంకరన్ 4వ స్మారకోపన్యాసంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ శంకరన్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగినప్పటికీ, రాష్ట్ర నలమూలనుంచి దళితులు, ఆదివాసీలు, ప్రజల వచ్చి ఆయనకు ఘన నివాళిని అర్పించారన్నారు. శంకరన్ వ్యక్తిత్వం చాలా గొప్పదని, ఎందరో అధికారులు శంకర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తమ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు దోహదపడిందన్నారు. అధికారులకు క్లిష్టమైన సమస్య ఎదురైనప్పుడు గతంలో శంకరన్ పరిష్కరించిన తీరును గుర్తుచేసుకొని వాటి పరిష్కారానికి పూనుకునేవారన్నారు. ఎస్ ఆర్ శంకరన్ గౌతమ బుద్ధుని బోధనలు, కార్ల్ మార్క్స్, అంబేద్కర్, గాంధి లాంటి వారి బోధనల సారాన్ని తెలుసుకుని తన జీవితాన్ని పేద ప్రజల సంక్షేమానికి అంకితం చేశారని రామచంద్రమూర్తి తెలిపారు.

కార్యక్రమంలో చుక్కా రామయ్య, కె ఆర్ వేణుగోపాల్, కాకి మాధవరావు, టి యల్ శంకర్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి, ప్రొఫెసర్ తిరుపతిరావు, జీవన్ కుమార్, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎస్ వి సత్యనారాయణ, ఆంజనేయులు, డాక్టర్ కనకరాజు, ప్రొఫెసర్ కృష్ణ,  ప్రొఫెసర్ చెన్నబసవయ్య  తదితరులు  పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.