దిల్లీ సింహాసనం ఎవరిది?

  • మోదీ, కేజ్రీవాల్ మధ్య నువ్వా-నేనా
  • మోదీపైనే ఆధారపడిన దిల్లీ భాజపా
  • ఆర్నెల్లుగా ప్రజలకు చేరువైన కేజ్రీవాల్, ఏఏఫీ

 

(సంజయ)

దిల్లీ, జనవరి 14: దిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ప్రధానంగా పోటీ భారతీయ జనతా పార్టీ (భాజపా), ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏఫీ)ల మధ్యనే ఉంటుందని రూఢిగా చెప్పవచ్చు. మంగళవారంనాడిక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ధిల్లీ రాష్ట్ర ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహం గురించి పెద్దగా చర్చించలేదు. షీలాదీక్షిత్ ప్రత్యర్థి, రాహుల్ గాంధీ సన్నిహితుడు అజయ్ మకెన్ కు ఎన్నికల ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఇదివరకే నిర్ణయించింది. దిల్లీలో విజయావకాశాలు అంతంత మాత్రమే కనుక ఎన్నికల గురించి కాకుండా భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ మోదీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను ప్రతిఘటిస్తూ ఉద్యమం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం తీర్మానించింది.

ఇటీవల ఇండియా టుడే-సిసిరో బృందం నిర్వహించిన జనాభిప్రాయ సేకరణలో దిల్లీ అసెంబ్లీ పరిధిలో భాజపాకు 40 శాతం ప్రజలు మొగ్గు చూపుతున్నారనీ, ఏఏఫీకి 36 శాతం మంది సుముఖంగా ఉన్నారనీ, కాంగ్రెస్ పార్టీకి కేవలం 16 శాతం మాత్రమే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారనీ తేలినట్టు వార్తలు వచ్చాయి.

పోటీ భాజపా, ఏఏపీల మధ్యనే అని చెప్పడానికి ఇది ప్రధాన  కారణం. కానీ కాంగ్రెస్ మరింత జావకారిపోవడం అన్నది భాజపాకి శుభసూచిక కాజాలదు. కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లయితే త్రిముఖ పోటీలో భాజపాకి ఆధిక్యం ఉంటుంది. మోదీ సమ్మోహనాస్త్రంతో పార్టీ గట్టెక్కి గద్దెనెక్కగలుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయినట్లయితే ఆ మేరకు ఏఏపీ బలపడి భాజపాకు గట్టి పోటీ ఇవ్వగలగుతుంది. వాస్తవానికి 2013 డిసెంబర్ లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు ఒక మోస్తరుగా వచ్చాయి కనుక భాజపాకి 31 సీట్లు లభించాయి. ఏఏఫీకి 28 స్థానాలూ, కాంగ్రెస్ కు ఎనిమిది సీట్లూ దక్కాయి. ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచారు.

ఇప్పుడు కాంగ్రెస్ ఓటింగ్ శాతం ఎంత తగ్గిపోతే ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అంత లాభం. పైగా పైన పేర్కొన్న జనాభిప్రాయ సేకరణ ఫలితాలకు ప్రచారం లభించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ప్రజలు నమ్మితే, ఓడిపోయే పార్టీకి ఓటు వేయడం దండగ అనే అభిప్రాయంతో  ఆ ఓట్లు కూడా ఏఏఫీకి వేసే అవకాశం ఉంది.

నిరుడు మేలో కానీ, 2013 డిసెంబర్ లో కానీ ఏఏపీ పట్ల ప్రజలలో ఉత్సాహం ఉండేది. ఏఏఫీ ఒక కొత్త తరహా పార్టీ అనీ, ఆదర్శాలకోసం నిలబడే పార్టీ అనీ ఒకానొక ఆకర్షణ ఉండేది. భాజపాలో లాగే ఈ పార్టీలో కూడా ఒకే నాయకుడి ప్రాబల్యం విపరీతంగా పెరిగింది. భాజపాలో మోదీకి తిరుగులేనట్టే ఏఏఫీలో అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురు లేదు. లోక్ సభ ఎన్నికల ముందు భాజపా ప్రాబల్యం కంటే మోదీ ప్రాబల్యం మెండు. అదే సమయంలో కేజ్రీవాల్ ఆకర్షణ కంటే ఏఏఫీ ఆదర్శాల ఆకర్షణ అధికం. ఇప్పుడు రెండు తారుమారైనాయి. భాజపాలో మోదీ ప్రభావం తగ్గి మతఛాందస వాసనలు మళ్ళీ గుప్పుమంటున్నాయి. సాక్షీమహరాజ్ లూ, సాధువులూ, సాధ్వీమణులూ చిత్తం వచ్చినట్టు ప్రకటనలు చేసి హిందూత్వ ఎజెండానూ నిత్యం దేశ ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఏఏఫీలో పార్టీ ప్రాబల్యం కంటే కూడా కేజ్రీవాల్ ప్రతిష్ఠ, రాజకీయ భవితవ్యం ప్రధానమైపోయాయి. ఏఏఫీ కొత్తరకం పార్టీ అనీ, కొన్ని నిర్దిష్టమైన ఆదర్శాలకు కట్టుబడి ఉంటుందనే ప్రచారంతో ఆ పార్టీకి 2014 ప్రథమార్ధంలో ప్రజాదరణ గరిష్ట స్థాయికి చేరుకుంది.

ఇప్పుడు భాజపా పరిస్థితి ఏమిటి? మోదీ రక్షణ కోసం ఎదురు చూస్తున్న పార్టీ అది. మోదీ లేకపోతే పార్టీకి ఆదరణ కరువైన పార్టీ. ఇప్పుడు పార్టీ స్తబ్దుగా ఉండటానికీ, ఓడిపోయే అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పుకోవలసిన దుస్థితి రావడానికి ఒక రకంగా మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా కారకులు. 2014 జూన్ –జులై మాసాలలోనే కేజ్రీవాల్ రాజీనామా తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి ఉంటే మోదీ ప్రభంజనంలో భాజపా దిల్లీ సింహాసనం అవలీలగా కైవసం చేసుకొని ఉండేది. కానీ తాము ఏడు మాసాలలోనే రెండో సారి ఎన్నికల పోరాటానికి సిద్ధంగా లేమంటూ భాజపా ఎంఎల్యేలు చేసుకున్న విన్నపాలను పార్టీ నాయకత్వం మన్నించడం పెద్ద పొరపాటు. దిల్లీ భాజపా నాయకత్వం నుంచి హర్షవర్థన్ ను తప్పించడం మరో తప్పిదం. దిల్లీలో ఉన్న భాజపా నాయకులలో ఎంతోకొంత జనాకర్షక శక్తి ఉన్న నాయకుడూ, ముఖ్యమంత్రి పదవికి అర్హుడని ప్రజలు సైతం భావించే నేత డాక్టర్ హర్షవర్థన్. అటువంటి నాయకుడు ఈ రోజున దిల్లీ భాజపాలో మరొకరు లేరు. ఇప్పటికైనా హర్షవర్థన్ ను దిల్లీ రాజకీయాలలో దింపితే మంచిదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. హర్షవర్థన్ కు అవినీతి అతీతుడనే మంచి పేరు, కష్టించి పనిచేసే తత్త్వంతో పాటు మోదీ ఆకర్షణ కూడా కలిస్తే భాజపా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉండేవి.

అన్ని అంశాలనూ పరిశీలించిన తర్వాత ఫిబ్రవరి 10న జరిగే పోలింగ్ లో భాజపా, ఏఏపీలకు దాదాపు సమానంగా ఓట్లు వస్తాయని అంచనా వేయవచ్చు. కేజ్రీవాల్ 49 రోజుల గందరగోళ పరిపాలన తర్వాత అకస్మాత్తుగా జన్ లోక్ పాల్ బిల్లు పేరుమీద రాజీనామా చేయడం దిల్లీ ప్రజలకు బొత్తిగా నచ్చలేదు. కానీ తన తప్పిదాన్ని తెలుసుకున్న తర్వాత కేజ్రీవాల్ దిల్లీ ప్రజలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు. అది ప్రజలకు నచ్చినట్టు కనిపిస్తున్నది. ఎన్ని తప్పులు చేసినా సరే రాజకీయ నాయకులు క్షమాపణలు చెబితే క్షమించే గుణం ఈ దేశ ప్రజలకు ఉన్నది.

కేజ్రీవాల్ గత ఆరు మాసాలుగా కాలికి బలపం కట్టుకొని ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేస్తూ వచ్చాడు. పార్టీని ప్రజలకు చేరువగా తీసుకొని పోయాడు. పార్టీ శ్రేణులను తిరిగి సమీకరించాడు. పార్టీని బలోపేతం చేశాడు. ప్రచారంలో కొత్త పుంతలు తొక్కాడు. ఇందుకు భిన్నంగా దిల్లీ భాజపా నాయకులు ఆరు మాసాలుగా చేసింది సున్న. మోదీ వచ్చి రక్షించాలని ఎదరు చూపులు చూశారే తప్ప తామంటూ చేసింది ఏమీ లేదు.

ఎవరు గెలిచి ఎవరు ఓడినా, ఎన్నికల తర్వాత భాజపా మాత్రం మితవాద, హిందూత్వ పార్టీగా ముద్రను వేసుకొని దిల్లీ హిందువుల పార్టీగా మారుతుంది. గణనీయమైన ప్రాబల్యం కలిగి ఉంటుంది. ఇంతకాలం వామపక్ష భావాలూ, లౌకికవాద భావాలూ కలిగినవారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసేవారు. వారంతా క్రమంగా ఏఏఫీకి తరలిపోతారు. ఏఏఫీ గెలిచింది మరోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఇదివరలోలాగా కాకుండా ఐదేళ్ళూ పరిపాలించే ప్రయత్నం చేస్తారు. భాజపా గెలుపొందే పక్షంలో ఏఏఫీ ప్రతిపక్ష స్థానంలో అత్యధిక భాగం ఆక్రమించుకుంటుంది. కాంగ్రెస్ ను బలహీనం చేసి ఏఏఫీ బలపడటం ఒక్కటే మార్గం. కాంగ్రెస్ పోరాడే మానసిక స్థితిలో లేదు కనుక ఏఏపీకి అనుకూలంగా పరిస్థితులు మారవచ్చు. చివరికి ఏఏఫీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపోను సీట్లు సంపాదించినా, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా స్థానాలు గెలుచుకున్నా అది అరవింద్ కేజ్రీవాల్ కిరీటంలో కలికితురాయి అవుతుంది. మోదీ ప్రచార ప్రభావంతో భాజపా గెలిచిన పోరాడి ఓడిపోయిన కీర్తి కేజ్రీవాల్ కు దక్కుతుంది. ఏది ఏమైనా పోటీ మోదీ, కేజ్రీవాల్ మధ్యనే అన్నది సుస్పష్టం. మోదీ ప్రధానిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా రాలేరు. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ తో సరితూగ గల నాయకుడు దిల్లీ భాజపాలో లేరు. అదే కేజ్రీవాల్ కు సానుకూలమైన అంశం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.