దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై తెలంగాణ శాసనసభలో తీర్మానం

kcr-assembly-21హైదరాబాద్, నవంబర్ 21: శంషాబాద్ ఎయిర్ పోర్టు దేశీయ టెర్మినల్ పేరు మార్పు అంశంపై తెలంగాణ శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది. శాసనసభాపక్ష నేతల నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాంగా ఉన్న డొమెస్టిక్ విమానాశ్రయానికి ఎన్ టి రామారావు పేరు పెట్టడం విచారకరమన్నారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కేసీఆర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకొని యదాతధ స్థితిని కొనసాగించాలని సభలో కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు.

కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తదుపరి కూడా సీమాంధ్ర ఆధిపత్యాన్ని తెలంగాణ ప్రాంతం మీద కొనసాగించాలని ప్రయత్నంచేస్తే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజానీకం తిరుబాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆమోదం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు జీవన్ రెడ్డి తెలిపారు.

తెలుగుదేశం శాసనసభపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ దేశీయ టెర్మినల్ కు గతంలో ఎన్ టీ రామారావు పేరు ఉందని, దానిని గత ప్రభుత్వం కావాలనే ఎన్టీఆర్ పేరు తొలగించిందని ఆరోపించారు.

పేరు మార్చాల్సి వస్తే కొమురం భీం పేరు పెట్టాలని సీపీఎం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు సూచించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానాకి కాంగ్రెస్, వైకాపా, ఎఐఎం, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపాయి. తెలుదేశం సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించగా, భారతీయ జనతా పార్టీ తీర్మానంలో సవరణలు చేయాలని సూచించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.