నాణ్యమైన విద్య ఎంతో అవసరం : కేసీఆర్

హైదరాబాద్ : విద్యను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కెనడాకు చెందిన యార్క్ యూనివర్సిటీ జీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా నెలకొల్పిన స్కూలిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్‌ను ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం నోవాటెల్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన విద్య ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఐఎస్‌బీ, నల్సార్ లా యూనివర్సిటీ, ఐఐటీవంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని వివరించారు. బిజినెస్ స్కూల్‌ను నెలకొల్పడానికి జీఎంఆర్, కెనడా యార్క్ యూనివర్సిటీ హైదరాబాద్‌ను ఎంచుకోవడం అభినందనీయమన్నారు.

ఇంకా అంతర్జాతీయ సంస్థలను నెలకొల్పాల్సిన అవసరముందన్నారు. పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు హైదరాబాద్‌లో వాతావరణం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.

kcr_business schoolహైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక సంస్థలు, పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు వచ్చేవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపనకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎకరాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిశ్రమలు స్థాపించేవారికి వెంటనే అనుమతులు ఇవ్వడానికి అత్యుత్తమ విధానాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు కేశవరావు, కెనడా స్కూలిచ్ బిజినెస్ స్కూల్ డీన్ డెజ్‌సో జే హార్వత్, చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ, జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ సీఈవో వీ రఘునాథన్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.