నిచ్చెనలు ఆకాశంలోకీ… అనకొండ పాములు నేలమీదికీ…

babu-upa-sangham-29 file photo

కొడవగంటి కుటుంబరావుగారు రాసిన `స్వార్ధబుద్ధి` అనే కథలో యువరాజు తన ముసలి మంత్రితో “ప్రజలకు అవసరమైన పనులు చేయటానికి అమోఘమైన తెలివితేటలు అవసరంలేదు. ప్రజలకేం కావాలో తెలిస్తేచాలు. ప్రజల్ని మోసంచేయటానికే ఎక్కువ తెలివితేటలు కావాలి“ అంటాడు. విశాలాంధ్రప్రదేశ్ ని 10 సంవత్సరాలు గతంలో ఏలిన చంద్రబాబు సింగపూరు నుండి తెలివితేటలు కూడా అరువు తెచ్చుకున్నట్లున్నాడు. గట్టిగా మన ఒక జిల్లా అంత జనాభా (40 లక్షలలోపు) లేని సింగపూరులోని ఎత్తైన భవంతులు చూపి, ప్రపంచ దేశదేశాల ద్రవ్యజూదరుల నల్లధన కేంద్రమైన సింగపూరును తన టెక్నికలర్ కలల రాజ్యంగా ప్రకటనలు గుప్పిస్తున్నాడు. ప్రజల అవసరాల గురించి తనకు మాత్రమే తెలుసునని మిగతావారినెవరినీ లక్ష్యం పెట్టననే ఏకవ్యక్తి, ఏకపార్టీ పరిపాలన సాగించే సింగపూరు ప్రధాని లీ సూన్ తాంగ్ ను ఆదర్శంగా స్వీకరించనట్టున్నాడు. 2010 లో ప్రపంచంలో సంపన్నులు అధికంగా ఉన్న దేశంగా నమోదయిన సింగపూరులో నూటికి 20 మంది అతి నికృష్ట జీవితాలు గుడుపుతూ గత 10 ఏళ్లల్లో ఎలాంటి మెరుగుదలకూ నోచుకోకుండా వున్నారన్న వాస్తవాన్ని వీరు కప్పిపుచ్చుతున్నారు. సింగపూరు అందాలకు తమ రక్తాన్ని, చెమటను చిందించింది నిరుపేదలే! భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశాలలో (ఈ మూడు దేశాల జనాభా 150 కోట్లు) దిక్కులేక కడుపు చేతబట్టుకుని నికృష్టజీవనానికి సిద్ధపడి తమ రెక్కలను అమ్మకాలకు పెట్టుకుంటూ సింగపూర్ లో సమస్త చాకిర్లు చేస్తూ కూడా, పగలు బజార్లో తమ మురికి దేహాలతో కనిపించటానికి ఇలాంటి వారికి అవకాశం లేదు. ఎలాంటి కార్మిక హక్కుల చట్టాలకూ నోచుకోకుండా, తప్పని స్థితిలో ఆందోళన చేస్తే క్రూర అణచివేతలకూ, తుపాకి కాల్పులకూ బలైపోయేది కూడా వీరే! ఏభైఏళ్ళుగా ఒకే పార్టీ పాలన సాగుతోన్న సింగపూరులో ఎవరికైనా ఎలాంటి విచారణ లేకుండా ఆంతరంగిక భద్రతా చట్టంకింద సంవత్సరాల తరబడి జైళ్ళపాలు చేయొచ్చు. ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులూ, జర్నలిస్టులూ, కార్మిక నాయకులూ హక్కుల అణచివేతకు గురయిన వారిలో ఉన్నారు. ఉదాహరణకు 1966లో కమ్యూనిస్టు అన్న అభియోగంతో అరెస్టయిన చియా తే పో 23 ఏళ్ళు ఎలాంటి విచారణ లేకుండా మొత్తం 32 ఏళ్ళు (నెల్సన్ మండేలా కంటె ఎక్కువ) జైలులో మగ్గిపోయాడు.

మొత్తం తినుండారాలను దిగుమతి చేసుకోవటమే తప్ప వడ్లగింజ పండించటం ఎరగని సింగపూరులాంటి కొత్త రాజధానిని నిర్మిస్తానని ఆకాశానికి నిచ్చెనలేస్తున్న చంద్రబాబు పలుకులు లేతసొరకాయలైతే మనం పెద్దగా బాధపడక్కర్లేదు కానీ నిజమైతేనే నిజంగా దిగులు చెందాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ `రాజధాని` నేలమీదికి అప్పుడే అనకొండ పాములు దిగి వాటి విషజ్వాలల్ని చిమ్మటం మొదలు పెట్టేశాయి. పంట పొలాలమీద ఆధారపడి తమ వ్యవసాయపనుల నైపుణ్యంతో జీవిస్తున్న కూలీలు, కౌలురైతులకు వెట్టిచాకిరీ బతుకులు కళ్ళల్లో కదలాడుతున్నాయి. కన్నవారినీ, పెరిగిన ఊరునీ, అనుబంధం పెంచుకున్న పంటపొలాల్నీ, పశువుల్నీ వీడి వలసలుపోయి కూలీలుగా, రిక్షావారిగా, గృహనిర్మాణ కార్మికులుగా, వెట్టిచాకిరీలు చేస్తూ మురికి గుంటలపక్కన దోమల నడుమ జానాబెత్తెడు గుడిసెల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి వారికి గోచరిస్తోంది. పేదమధ్యతరగతి రైతులకు అనిశ్చితమైకానరాని భవిష్యత్తు ఒకవైపు, తక్షణం భూములను అమ్మి సొమ్ము చేసుకో అనే ఆవల పల్లకీ మరోవైపు కనిపిస్తున్నాయి. సంపన్నరైతులు కూడా ధనసంస్కృతి కాలుష్యపు కోరలనుండి తప్పించుకోలేక విలవిలలాడక తప్పని స్థితే వుంది. వెరసి ఎవరికీ కాలు నిలువదు. కునుకుపట్టదు. ఆశ చావదు. భయం వీడదు. ప్రశాంతమైన చెరువులో చంద్రశిల విరిగిపడ్డట్టు అంతా కలకలం, కల్లోలం. కలహాలూ కంగాళీ!!.

కుండెడు పాలలో ఒక్క విషం బొట్టు పడ్డా అది పాలను ఎలా విరిచేస్తుందో ధనస్వామ్యం అందునా అడ్డగోలు ధనాకార్షణ మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేయగలుగుతుంది. మొగుడూ-పెళ్ళాం మధ్య, అన్నదమ్ముల మధ్య, తండ్రీకొడుకుల మధ్య, తల్లీకూతుళ్ళమధ్య, అత్తాకోడళ్ళమధ్య, మావా అల్లుళ్ళమధ్య, ఇరుగూ పొరుగూమధ్య, కులానికీ, కులానికీ మధ్య, పార్టీకి-పార్టీకి మధ్య, గ్రామానికి-గ్రామానికీ మధ్య ఇలా ఏ యిద్దరి మధ్యనైనా మానవీయ సంబంధాలను భళ్ళున బద్దలుకొట్టి, గొల్లున గెలిచేసి ఆడించే వికృత విలాస క్రీడాభూతమది. అది రైతుల్ని మాజీ రైతులుగా మారుస్తుంది. పంటపొలాల్ని కాంక్రీటు వనాలు చేస్తుంది. మూగజీవాల హృదయాలను చదవగలిగిన రైతులు మార్కెట్టు మాయాజాలం ముందు తామే మూగబోయేట్లు చేస్తుంది.

farmers-29

అమరావతి సీమ రైతాంగాన్ని చంద్రబాబు సూటిగా యిలా ప్రశ్నిస్తున్నాడు. “నేను రేపు సృష్టించబోయే మబ్బులు, అవి ఎల్లుండి కురిపంచబోయే కాసుల వర్షం మీకు కావాలా? మా కార్పొరేట్ మిత్రులు నేడు ఇవ్వచూపే ఎకరాకు కోటిపైన ధనరాసి కావాలా? కోరుకోండి“ అని శకుని పాచికలు విసురుతున్నాడు. ఈలాంటి జూదంలో ఎప్పుడూ పేద మధ్యతరగతి ప్రజలు, మట్టిని నమ్మినవారూ ఓడిపోతారని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎర్రని ఏగానీ యివ్వనివాడు రేపు ఏదో చేస్తానంటే నమ్మాలా? అదృశ్య కార్యొరేట్ శక్తులకు భూమిని అమ్మాలా? రైతుల ఆవేదన యిది. ఆందోళన యిది!.

గత నెల రోజులలో కొత్తరాజధాని ప్రాంతమైన తుళ్ళూరు చుట్టుప్రక్కల తాడికొండ, మంగళగిరి పరిధిలో సుమారుగా 3000 కోట్ల రూపాయల భూముల బేరసారాలు జరిగితే రెండువందల కోట్ల రూపాయలలోపు కొనుగోళ్ళు అమ్మకాలుగా మాత్రమే రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదయ్యాయి. తెల్లధనానికి తోడు సుమారు 15 రెట్లు నల్లధనం చేతులు మారింది. అంటే మార్కెట్లోకి ప్రవేశించింది. అది కుటుంబాల్లో పెంచే కలహాలను పరిష్కరించటానికి పోలీసులకు, కోర్టులకూ పని పెరుగుతుంది. ప్రైవేటు సెటిల్మెంట్ గ్యాంగులైన మాఫియాల అవసరం పెరుగుతుంది. గృహహింసలు పెరుగుతాయి. విచ్చలవిడి తాగుళ్ళు పెరుగుతాయి. వ్యభిచారం, విలాసాలూ, దుబారాలు పెరుగుతాయి. తెలియని వ్యాపారాల్లో పొందే చేదు అనుభవాలు మిగులుతాయి దోసిట్లో పోసిన నీరు కారిపోయినట్లుగా, క్రమంగా నూటికి 90 మంది రైతుల చేతుల్లో నుండి సొమ్ములు జారిపోయి కార్పొరేట్ శక్తుల ఆస్తిపాస్తులుగా అమరుతాయి. హైదరాబాదులో ఔటరు రింగురోడ్డు నిర్మాణ సందర్భపు అనుభవం మాత్రము కాదు, అనేక చోట్ల సెజ్జులపేరిట రైతులను భూములనుండి బేదఖల్ చేసిన అన్ని అనుభవాలూ ఇవే.

రాజధాని నిర్మాణానికి తొలిదశలో 30 వేల ఎకరాలూ, మలిదశలో లక్ష ఎకరాలూ కావాలనే మాటలు వినగానే యిది రాజధాని నిర్మాణం సాకుతో సాగించబోయే రియల్ఎస్టేట్ వ్యాపారమని మెడమీద తలవున్న ప్రతివారికీ అర్ధమయ్యే విషయమే! ఇప్పటికీ ఉమ్మడి రాజధాని భవనాలుగా ఉన్న హైదరాబాదులోని సచివాలయం కేవలం 22 ఎకరాల్లోనూ, హైకోర్టు 12 ఎకరాల్లోనూ, అసెంబ్లీ-శాసనమండలీ కలిసి ఎనిమిదిన్నర ఎకరాల్లో మాత్రమే నిర్మాణమై ఉన్నాయి. మొత్తం కలిపినా 50 ఎకరాలు లేదు. సింగపూరు నల్లధన స్వాములకు చక్రవర్తులైన అమెరికా దేశపు రాజధానీ భవనాలు 500 ఎకరాల్లో ఉండగా ఇక్కడ 30 వేల ఎకరాలు కావాలనటం హాస్యాస్పదం కాకపోతే, కార్పొరేట్ వ్యాపారీయం అయి ఉండాలి. పోనీ చంద్రబాబు ఆదర్శరాజ్యమైన సింగపూరు కంటె రెండురెట్లు ఎక్కువలో నిర్మించటానికి అవకాశం తీసుకోమందాం కానీ, అన్నెన్ని వేల ఎకరాల నుండి రైతుల్ని బేదఖల్ చేయటాన్ని రాష్ట్ర ప్రజలు, రైతాంగం అనుమతించకూడదు. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో రైతాంగ ప్రయోజనాలే రాజ్యపు మొదటి ప్రాధాన్యమై ఉండాలి. వ్యవసాయాభివృద్ధి, దానిపై ప్రత్యక్షంగా జీవించే వర్గాల ప్రజల జీవితాభివృద్ధి తొలి ప్రాముఖ్యత గలదై ఉండాలి. “అదిగో అంటే ఆర్నెల్లు“ అన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంతోపాటు చంద్రబాబు తొలిగా సంతకం చేసిన రైతుల రుణమాఫీ అజాపజా కనబడటంలేదు. కౌలు వ్యవసాయం పెరిగిపోయిన నేడు, మట్టిని మాణిక్యాలుగా మార్చే నిజం రైతు నోట మట్టి కొడుతున్నారు. “అప్పుతెచ్చి లేపిన మిద్దెలో కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది“ అన్నాడు `వందేమాతరం` గేయంలో చెరబండరాజు. వాస్తుదోషం లేకుంటే చాలు ఎంత అప్పయినా ముప్పురాదు అంటున్నాడు చంద్రబాబు. రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కొల్లగొట్టిన సొమ్ము, నల్లధనపు రాసులుగా మేటలు వేసుకుని ఉన్న వారి ప్రయోజనాలకు, రాజధాని పేరిట సాగిలబడటం, చంద్రబాబు విధానాలుగా రుజువవుతున్నాయి. కార్పొరేట్ శక్తులకు దాసోహమంటే అది ఒకచోట ఆగేదికాదు. సమస్త జీవన రంగాల్ని ప్రభావితంచేసి క్షీణసాంస్కృతిక విలువలు వరిన్ని వ్యాపించటానికి ప్రత్యక్షకారక మవుతుందని `ప్రజాసాహితి` హెచ్చరిస్తోంది.

ఇప్పటికే సేకరించదలుచుకున్న 30 వేల ఎకరాల్లో ప్రభుత్వ, బంజరు భూములే చాలా ఉంటాయి. వాటిలో 500 ఎకరాలు రాజధానికి సరిపోతుందని నిపుణులే పేర్కొన్నట్టు పత్రికలలో వచ్చింది. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే ప్రజల్ని కొల్లగొట్టి నల్లధన యోధులకు మెక్కబెట్టే అతి తెలివైన పథకం వేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. కొ.కు.చెప్పిన ఈ మోసకారితనాన్ని మనం చావు తెలివితేటలంటే తప్పా?

-దివికుమార్

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Srinivas says:

    Very Good article. It is realist and true. But most of the people won’t agree with this article. People will realize this after 10 yrs.