నిరుపేదలకు ఏకైక రవాణా సౌకర్యం ఆర్టీసీ : కేసీఆర్

kcr-rtc-2-29

తెలంగాణ ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేసిన మెట్రో లగ్జరీ బస్సులను ప్రాంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణలోని ప్రజలు ఎక్కువ భాగం ఆర్టీసీ మీదనే ఆధారపడి ఉన్నారని, ఆర్టీసీ నిరుపేదలకు ఏకైక రవాణా సౌకర్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేసిన 80 మెట్రో లగ్జరీ ఏసి బస్సులను కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 10300 బస్సులతో దేశంలోనే మూడవ అతి పెద్ద రవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీ ఉందన్నారు. ప్రతి రోజు 90 లక్షల పైగా ప్రయాణికులను ఒకచోటి నుంచి మరొక చోటుకి సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేస్తుందని తెలిపారు. అటువంటి ఆర్టీసీ ని ప్రైవేటు పరం చేసే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మొదటగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కార్మికులకు ఇంక్రిమెంటు ఇవ్వడం మూలానా సుమారు 18 నుంచి 20 కోట్లు ఆర్టీసీ పై భారం పడనుందన్నారు. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి, ఆ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్టసీని లాభాల బాటలో తీసుకురావడానికి అన్ని యూనియన్ నాయకులు, అధికారులతో కలిసి సమీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు.

kcr-rtc-1-29

కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రంలోని 25 వేల కిలోమీటర్ల పంచాయత్ రాజ్, ఆర్ అండ్ బి రోడ్లకు పూర్తిస్థాయిలో తారువేయుటకు సుమారు 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 149 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్డు నిర్మించడానికి పంచాయిత్ రాజ్, ఆర్ అండ్ బి కలిపి దాదాపు 10 వేల కిలోమీటర్లు కొత్త రోడ్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతంలోని మట్టి రోడ్లకు కిలో మీటరుకు రూ 3 లక్షలు వెచ్చించి దాదాపు 20 వేల కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటి రోడ్లుగా మార్చడానికి రూ 600 కోట్లను మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

కార్మికులకు వసతులను కల్పించడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదేవిధంగా మహిళా కార్మికులకు ప్రత్యేక వసతిని కల్పించాలని ఆర్టీసీ ఎండీకి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కార్యక్రమంలో మంత్రి నాయిని నరసింహారెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.