నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తిచేయాలి : కేసీఆర్

kcr-cmd-31

బీహెచ్ ఈ ఎల్ సీఎండీ ప్రసాదరావుకు చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జెన్ కో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులన్నీ నిర్ణీత కాలవ్యవధిలో నిర్మించాలని బీహెచ్ ఈఎల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తొలి విడతగా రూ. 350 కోట్ల చెక్‌ను బీహెచ్ ఈఎల్ సీఎండీ ప్రసాదరావుకు ముఖ్యమంత్రి అందజేశారు.

కొత్తగూడెంలో రూ. 3810 కోట్లతో 800 మెగావాట్లు, మణుగూరులో రూ. 4200 కోట్లతో 1080 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను భేల్ నిర్మిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వరంగ సంస్థలకే అప్పగించడం ద్వారా పారదర్శకత ఉంటుందని తాను భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. విద్యుత్ ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని ఎప్పటికప్పుడు అందచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వరంగంలోనే పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది తన అభిమతమని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణను మూడేళ్లకాలంలో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా మారుస్తామని తాము ప్రజలకు హామీ ఇచ్చామని, దానిని నెరవేర్చాల్సిన బాధ్యత మీదే అని ఈ సందర్భంగా భెల్ సీఎండీ ప్రసాదరావు. కాగా కొత్తగూడెం, మణుగూరు విద్యుత్ ప్లాంట్ల డిజైన్‌లు, బాయిలర్లు, టర్బైన్ల నిర్మాణ ప్రతిపాదనలు పూర్తయ్యాయని, సివిల్ పనులు  పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని భెల్ సీఎండీ వివరించారు. మణుగూరులో రెండేళ్లలో, కొత్తగూడెంలో మూడేళ్లలో పనులు పూర్తిచేస్తామని తెలిపారు. వీటితోపాటు ఆదిలాబాద్‌లోని జైపూర్‌లో కూడా పనులు వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించారు.

నల్లగొండ జిల్లాలో 7600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు అవసరమయ్యే అనుమతులను కూడా త్వరలో సాధిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సమీక్షా సమావేశంలో మంత్రులు తారక రామారావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.