నిష్కర్షే కాళోజీ స్వంతం : సీఎం కేసీఆర్

kaloji 3వరంగల్ , సెప్టెంబర్ 9: అన్యాయాన్ని ఎదిరించడంలో కాళోజీ నిర్మొహమాటంగా ఉండేవారని, మొహమాటం లేని తనం, నిష్కర్ష ఆయన సొంతమని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ అన్నారు.  విశ్వమానవాళి సమస్యలను తన సమస్యలుగా చేసుకుని పోరాటం చేసిన గొప్ప వ్యక్తని ఆయన కొనియాడారు. కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వరంగల్ లో కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపనచేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజీ కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని, ఆయన విశ్వజనీనమైన, ప్రపంచ మానవాళి సమస్యలపట్ల పోరాటం చేసిన గొప్ప వ్యక్తని అన్నారు. తెలంగాణ భాషను, నుడికారాన్ని అతిగా ప్రేమించిన వ్యక్తి కాళోజీ అని గుర్తు చేశారు. తన భాషే తెలంగాణ భాష అని నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి కాళోజీ అని పేర్కొన్నారు.  ఇక నుంచి కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
kaloji 2 ప్రజా కవి కాళోజీది రాజీ పడని మనస్తత్వమని, అనుకుంటే చివరివరకు పోరాడేవారని కేసీఆర్ అన్నారు. కాళోజీ ఏనాడూ పదవులకు, డబ్బుకూ లొంగలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాళోజీ మానవ కళ్యాణం కోసం పోరాడిన వ్యక్తి అని ఆయన స్పూర్తితోనే తెలంగాణ సాకారమైందని కేసీఆర్ గుర్తు చేశారు.  కాళోజీకి స్వార్థం లేదు కాబట్టే ఆయన ఎవరికీ భయపడలేదని తెలిపారు. కాళోజీ సహచర్యంతో ఎంతో స్పూర్తి పొందానని కేసీఆర్ తెలిపారు.
kaloji 4హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిని మించే విధంగా కాళోజీ కళాక్షేత్రం ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. కాళోజీ కళాక్షేత్రం కోసం రూ. 12  కోట్లు విడుదల చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కాళోజీ కళాక్షేత్రానికి గత ప్రభుత్వం కనీసం 500 గజాల స్థలం కూడా ఇవ్వలేదని, ఇవాళ మూడున్నర ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కళాక్షేత్రంలో లైబ్రరీతో పాటు అన్ని వసతులు కల్పించనున్నట్లు కేసీఆర్ హామీనిచ్చారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సి ఎం రాజయ్య, కేశవరావు, తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.