నూతన సచివాలయం నిర్మాణానికి కమిటీ ఏర్పాటు

నూతన సచివాలయం నిర్మాణానికి కమిటీ ఏర్పాటు

హైదరాబాద్: సచివాలయం కొత్త భవన నిర్మాణం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలను చేపట్టింది. ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా నూతన సచివాలయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల నిధులను మంజూరు చేసింది.

ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ఆవరణలో నూతన సచివాలయం నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలను చేపట్టింది. సచివాలయ తరలింపును నిలిపివేయాలని విపక్షాలు కోరుతున్నప్పట్టికీ ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోనేది లేదనే సంకేతాలు పంపింది. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ఆవరణలోనే సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల  హెచ్ ఓ డి లకు భవనాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు రాష్ట్రమంత్రివర్గం కూడా ఆమోదముద్ర వేసింది. మంత్రివర్గ నిర్ణయం పై విపక్షాలు ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

వాస్తు పేరుతో ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని పైకి చెబుతున్నా అంతర్గతంగా ఇతర కారణాలున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓ రియల్ ఏస్టేట్ కంపెనీకి ప్రస్తుత సచివాలయ స్థలాన్ని కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ఆవరణకు మార్చాలని నిర్ణయం తీసుకొందని బీజేపీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి స్థలం చారిత్రక స్థలమని దీనిపై కోర్టులో ఇప్పటికే కేసులు కూడ ధాఖలయ్యాయి. ఈ విషయమై రెండు వారాల్లో  నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు పురావస్తుశాఖను ఆదేశించింది. కోర్టులో కేసులు దాఖలైనా లెక్కచేసేదిలేదంటూ, నూతన సచివాలయాన్ని ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ఆవరణలో నిర్మించేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసుకొంటుంది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కమిటీని కూడ ఏర్పాటు చేసింది. జీఏడీ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా చైర్మెన్ గా ఉంటారు. ఈ కమిటీలో మున్సిపల్, రెవిన్యూ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి మెంబర్ కన్వీనర్ గా ఉంటారు.

శాసనసభ బడ్జెట్ సమావేశాలు సాగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ జివో ను జారీ చేసింది. కాని ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడంతో విపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.