నేడు ప్రపంచ ప్రేమికుల రోజు

Valentines-day

ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రేమికులు ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు. ప్రేమికుల రోజున ప్రేమికులు అందమైన గ్రీటింగ్ కార్డులు, గిఫ్ట్ లు మరీ ముఖ్యంగా ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే ఎర్రగులాబీలు అందించుకుంటూ ప్రేమికులు ఇరువురు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ప్రేమికుల రోజును సెయింట్ వాలెంటైన్స్ డే గా కూడా పిలుస్తారు. ప్రేమికుల రోజున ఎక్కువగా కొత్త జంటలు తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. క్రైస్తవ మత దేశాలలో వాలెంటైన్స్ డే ను సెలవు దినంగా కూడా పాటిస్తారు. ప్రేమికుల రోజున ఇప్పుడంటే గిఫ్ట్ కార్డులు ఇస్తున్నారు కానీ 19వ శతాబ్దంలో చేతితో రాసిన సందేశాలను పంపేవారు. బ్రిటన్ లో మాత్రం కానుకలిచ్చే సంప్రదాయం అమలులో ఉండేది.
1847 లో ఈస్టర్ హాలెండ్ అనే మహిళ మసాచూసెట్ లో వాలెంటైన్ కార్డుల తయారీకి నాంది పలికారు. అయితే ఈ వాలెంటైన్ కార్డులు అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. యూఎస్ గ్రీటింగ్ కార్డుల సంఘం అంచనా ప్రకారం ఒక్క ప్రేమికుల రోజునే ఏకంగా ఒక బిలియన్ కార్డులు ఇవ్వబడతాయని తెలిపింది.

వాలెంటైన్స్ డే పై అనేక కథనాలు ప్రాచుర్యంలో వున్నాయి. క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్ నగరంలో వాలెంటైన్స్ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. పెళ్లి చేసుకునే యువకులు ఏకాగ్రతతో యుద్ధం చేయలేరని భావించిన రోమన్ చక్రవర్తి రెండో క్లారియస్ తన దేశంలో పెళ్ళిళ్ళను నిషేదించాడు. కానీ వాలెంటైన్ అనే రోమన్ పౌరుడు రోమన్ చక్రవర్తి శాసనాన్ని ధిక్కరించి ప్రేమికులను ప్రోత్సహించడం, వివాహాలు జరిపించడం చేసాడు. వాలెంటైన్స్ కి రోజురోజుకు అభిమానులు పెరిగిపోవడంతో రోమన్ చక్రవర్తి క్లారియస్ కి భయం వేసింది. దేశాన్ని కాపాడాల్సిన యువతను ప్రేమ పేరుతో బలహీనులుగా తయారుచేస్తున్నాడన్న అభియోగంపై రోమన్ చక్రవర్తి వాలెంటైన్ కి మరణ శిక్ష విధించాడు. అయితే వాలెంటైన్ అభిమానుల్లో రోమన్ చక్రవర్తి కుమార్తె కూడా ఉంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్ ని ఉరితీయడంతో ప్రేమకు మారుపేరుగా ఈ రోజును వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) గా జరుపుకుంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.