నేడే తెలంగాణ మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్: ఈ నెల 7వ తేదీ నుంచి జరిగే బడ్జెట్ సమావేశంలో భాగంగా తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం సచివాలయంలో జరుగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల తేదీలు, నూతన ఐటి పాలసీ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ సమావేశాల ముందు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం  నిర్వహిస్తారు. రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ఈ నెల 7న ప్రసంగించనున్నారు.

ఈ నెల 7వ తేది నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగా ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దీనిలో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలే ఎజెండాగా మంత్రివర్గ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను, ఆయా శాఖలకు కేటాయింపులు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బీఏసీ సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలను ఎప్పటివరకు నిర్వహించాలనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమౌతోంది. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలపై సమావేశం చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 11న రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ పై మంత్రి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు.

నూతన ఐటి పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నూతన ఐటి పాలసీకి ఆమోదం తెలిపే యోచనలో మంత్రివర్గం ఉంది. అదే విధంగా యాదగిరిగుట్ట అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ విషయమై మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.

తెలంగాణ త్రాగు నీరు ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ కోసం ప్రభుత్వం ఇటీవలనే ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. ఈ విషయమై క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం అవుతుంటే మరోవైపు ప్రతిపక్షాలుకూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సమాయత్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలనే దానిపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.