నేడే సద్దుల బతుకమ్మ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి జరుగుతున్నపండుగ. బతుకమ్మను అధికారిక పండుగగా ప్రకటించిన ప్రభుత్వం, ఉత్సవాల నిర్వహణకు రూ 10 కోట్లను విడుదల చేసింది. ట్యాంక్ బండ్ పై గురువారం జరిగే వేడుకపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధానిలో జరిగే ప్రధాన ఉత్సవంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, గవర్నర్ నర్సింహన్ పాల్గొననున్నారు.

ఎల్బీ స్టేడియంలో గురువారం ఉదయం బతుకమ్మలను పేర్చడం ప్రారంభిస్తారు. ఇందుకు కావాల్సిన పూలను సిద్ధం చేశారు. దాదాపు 25 వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. సాంప్రదాయబద్ధంగా గౌరమ్మను పూజించి సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీస్టేడియం నుంచి మంగళ వాయిద్యాలతో బతుకమ్మల ఊరేగింపు మొదలుకానున్నది. ఈ ఊరేగింపులో పది జిల్లాల నుంచి వచ్చిన శకటాలు, వందలాది మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేయనున్నారు. బతుకమ్మ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సద్దుల బతుకమ్మ నిర్వహణపై బుధవారం సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. బతుకమ్మ పండుగ జరుపుకునే చెరువుల వద్ద తగు జాగ్రత్తలతో పాటు ఎక్కడా ఎలాంటి లోటు రానీయకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఈ సారి సద్దుల బతుకమ్మను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకొని, వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. ప్రతి చెరువు వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, బతుకమ్మలను తీసుకొచ్చే రహదారుల్లో గట్టి భద్రత ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

నగరంలో పోలీసులు ట్యాంక్‌బండ్ వద్ద ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరు వేల మంది పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల ద్వారా ట్యాంక్ బండ్ పరిసరాలను పరిశీలిస్తామని నగర పోలీస్ కమిషనర్ మహెందర్ రెడ్డి చెప్పారు. పండుగ సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో లేజర్ షో నిర్వహించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్, లవ్ అగర్వాల్, మీనా, రాళ్లబండి కవితా ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.