పంట రుణ మాఫీ అమలుచేయాలి : కేసీఆర్

హైదరాబాద్ : ఈ నెల 15లోగా పంట రుణాల మాఫీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, రైతులకు కొత్త రుణాలు మంజూరయ్యేలా చూడాలని కేసీఆర్ తెలిపారు. విద్యార్థులకు అవసరమైన ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు రేషన్ కార్డు, అన్ని రకాల పెన్షన్లు, ఇతర పథకాల వర్తింపు కోసం అధికారులు ఈ నెలాఖరులోగా తగిన చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పెన్షన్‌ను నవంబర్ నెల నుంచే అందివ్వాలని నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

పేదలకు నిత్యావసరాల పంపిణీ కోసం రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర కుటుంబ ఆహార భద్రతా కార్డులను జారీ చేయాలని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం (ఫాస్ట్) పథకం కింద లబ్ధి పొందాలనుకునే విద్యార్థులు స్థానిక తహసీల్దార్లకు ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు పెట్టారు. ఎమ్మార్వోలు వాటిని పరిశీలించి ఈ నెలాఖరులోగా సర్టిఫికెట్లు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సామాజిక భద్రతా పెన్షన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఈ నెల 15లోగా వీఆర్‌వోలకు తెల్లకాగితంపై పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని ఈ భేటీలో నిర్ణయించారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. వికలాంగులకు సదరు సర్టిఫికెట్లు మంజూరు చేయడానికి ఏరియా ఆసుపత్రుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, వచ్చే నెల నుంచే కొత్త పింఛన్లను అందించాలని ఆదేశించారు.

kcr-2అదేవిధంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలందరికీ నిత్యావసర వస్తువులు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర కుటుంబ ఆహార భద్రతా కార్డు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ కార్డుల కోసం ఐదెకరాలకుకంటె తక్కవ భూమి ఉన్న ప్రజలు గ్రామాల్లోని వీఆర్‌వోలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల బియ్యం ఇవ్వడానికి ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆహారభద్రతా కార్డు, పెన్షన్ లబ్దిదారుల గుర్తింపు, తదితర కార్యక్రమాలన్నీ పూర్తిగా తహశీల్దార్ల పర్యవేక్షణలో జరగాలని స్పష్టం చేశారు.

సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన వివరాలన్నింటిని మరోసారి పరిశీలించిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగరావు, ముఖ్య కార్యదర్శులు నాగిరెడ్డి, రేమండ్ పీటర్, పూనం మాలకొండయ్య, బీపి ఆచార్య, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి జోషి, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.