పసివాడి వైద్యానికి ఒలింపిక్ పతకం అమ్మేశాడు

వార్సా: ఒలింపిక్స్ లో పతకం గెలవడం అనేది ప్రతి క్రీడాకారుడు కనే ఒక మధురమైన కల. రేయింబగళ్ళు కష్టాలు, కన్నీళ్ళకోర్చి ఆ కలని ఎంతోమంది క్రీడాకారులు సాధించుకున్నారు. మెడలో ఒలింపిక్ మెడల్ తో గుండెల్లోని దేశభక్తిని గర్వంగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తులు ఎందరో. కానీ ఈ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా తను గెలుచుకున్న పతకాన్ని వేలం వేశాడు. అది కూడా క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక పసివాడి చికిత్స కోసం.

పోలండ్ దేశానికి చెందిన 33ఏళ్ళ ఆటగాడు పియోటర్‌ మలచోస్కి. రియో ఒలింపిక్స్ లో డిస్కస్‌ త్రో విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. అయితే ఒక మహిళ దగ్గర నుంచి వచ్చిన లేఖతో చలించిపోయాడు ఈ అథ్లెట్. మూడేళ్ళ తన కుమారుడు ఒలెక్ గత రెండు సంవత్సరాల నుంచీ కంటి క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, మెరుగైన చికిత్స కోసం న్యూయార్క్ తీసుకెళ్లడం ఒకటే మార్గమని ఆవిడ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ చూడగానే మరో ఆలోచన లేకుండా తాను సాధించిన పతకాన్ని వేలానికి పెట్టాడు మలచోస్కీ. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ లో వెల్లడించాడు. చిన్నారి చికిత్స కోసం ఉపయోగపడుతున్న ఈ రజత పతకం స్వర్ణం కంటే ఎంతో గొప్పదని పియోటర్‌ మలచోస్కి పేర్కొన్నాడు. కాగా తను వేలం వేస్తున్న విషయాన్ని పోస్ట్ చేసిన కొద్దిసేపటికే తన పతకం అమ్ముడైపోయిందని, డబ్బు మొత్తాన్ని ఆ పిల్లవాడి చికిత్స కోసం అందచేస్తున్నానని తెలిపాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.