పార్టీ ఫిరాయింపులను అర్థం చేసుకోండి ప్లీజ్

ప్రజాసేవ చేయాలంటే పదవులు కావాలి. పదవులు పొందాలంటే అధికారపక్షంలో ఉండాలి. పదవులు లేకపోయినా పైరవీలు చేసి తెలిసినవారికి మేలు చేయాలన్నా అధికార ప్రాపకం కావాలి. అంటే అధికార కేంద్రం పరిధిలో ఉండాలి. అధికారంలో ఉన్నవారికి అందుబాటులో ఉండాలి. ఇదీ రాజకీయశాస్త్ర సారాంశం. ఈ జ్ఞానం ఉన్నవారికి పార్టీ ఫిరాయింపులు దిగ్భ్రాంతి కలిగించవు. అర్థం అవుతాయి.

N T Rama Raoనైతికతను పట్టుకొని కూర్చునే వావిలాల గోపాలకృష్ణయ్యలాంటి వెర్రివెంగలప్పలు ఈ రోజుల్లో రాజకీయాలలో కనిపించరు. డబ్బులు లేకుండా రాజకీయం చేసే టంగుటూరి ప్రకాశం పంతులు ఇప్పుడు బతకలేడు. డబ్బులేకుండా ఎన్నికలలో పోటీ చేసే రోజులు ఎన్ టీ రామారావుతోనే పోయాయి. ‘తెలుగుదేశం పిలుస్తోంది రా!’ అంటే అనేకమంది మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతికి చెందిన న్యాయవాదులూ, అధ్యాపకులూ, సామాజిక కార్యకర్తలూ పరుగుల మీద వచ్చి పార్టీలో చేరి ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. వారే పదేళ్ళ తర్వాత తమ ‘ప్రియతమ నాయకుడి’కి వెన్నుపోటు పొడవడంతో సహకరించారు. అంటే ఎన్టీఆర్ హయాంలోనే నైతికతకు పాతర వేశారు. అందులో ఆయన ప్రమేయం లేదు. జామాత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్న సమయంలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో దాదాపు వందకోట్ల రూపాయలు ఖర్చు చేశారనీ, డజను మంది మంత్రులను నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి మకాం ఉంచారనీ అప్పటి వ్యవహారాలు తెలిసినవారు చెబుతారు. దర్శి ఉపఎన్నిక రాష్ట్రంలో ఎన్నికల వ్యయాన్ని ఆకాశమార్గం పట్టించిందనీ, అప్పటి నుంచీ నీకు టిక్కెట్టు ఇస్తే పార్టీకి ఎంత ఇస్తావు, నీ ఎన్నికల ప్రచారం కోసం ఎంత ఖర్చుచేస్తావు అంటూ పార్టీ నాయకత్వాలు అభ్యర్థులు కావాలని అభిలాష వెలిబుచ్చినవారిని ప్రశ్నించడం ప్రారంభించాయి. దాంతోనే ఎన్నికలలో సామాన్య కార్యకర్తలూ, మధ్యతరగతి వ్యక్తులూ పోటీ చేసే పరిస్థితులు లేకుండా పోయాయి.

tummala-trsఇప్పుడు ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఎవరికి పార్టీ టెక్కెట్టు లభిస్తోంది? ఇది ఒక పార్టీకి సంబంధించిన జాడ్యం కాదు. అన్ని పార్టీలూ అదే మురికి కూపంలో పడికొట్టుకుంటున్నాయి. నాయకులందరూ అదే గడ్డి తింటున్నారు. ఎన్నికలలో టిక్కెట్టు సంపాదించడానికి డబ్బు పెట్టాలి, ప్రచారం కోసం డబ్బు ఖర్చు చేయాలి, ఎన్నికల తర్వాత పదవులు సంపాదించాలి. పదవి చేతికి అందగానే అక్రమార్జన మార్గాలు అన్వేషించి ఖర్చు చేసినదానికి రెట్టింపు సంపాదించాలి, వచ్చే ఎన్నికల ఖర్చుకోసం డబ్బు కూడబెట్టాలి. ఈ సుడిగుండంలో చిక్కిన రాజకీయ వ్యవస్థలో పార్టీల పట్ల విధేయత ఉండాలని ఆశించడం అత్యాశ అవుతుంది.

chalasani-291014-300x228హైదరాబాద్ లో  చలసాని శ్రీనివాస యాదవ్ కావచ్చు. తీగల కృష్ణారెడ్డి కావచ్చు. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు. శ్రీనివాస యాదవ్, కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎందుకు చేరారు? ప్రజల కోసమే. బంగారు తెలంగాణ నిర్మించేందుకు కేసీఆర్ అన్నకు అండగా ఉండేందుకే. తమ స్వార్థం వీసమెత్తు కూడా లేదు. కొడుకుకు మేయర్ పదవి వస్తుందన్న ఆశ యాదవ్ కు లేదు. మెడికల్ కాలేజీకి అనుమతి రావాలన్న తాపత్రయం కానీ తనకు హుడా అధ్యక్ష పదవి వ్యామోహం కానీ తెగలకు లేదు.

babu-lokeshతెదేపాను ఎందుకు విడిచిపెట్టారు? మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న తమలాంటి విధేయులను కాదని చంద్రబాబునాయుడు తన కుమారరత్నం లోకేశ్ బాబుని నాయకుడుగా ముందు పెట్టడాన్ని సహించలేక. నాయుడుగారు అట్లా ఎందుకు చేస్తున్నారు? దేవేందర్ గౌడ్ నో, చలసాని శ్రీనివాస యాదవ్ నో, ప్రకాశ్ గౌడ్ నో పార్టీ నాయకుడుగా ప్రకటించవచ్చు కదా? పార్టీ తన సొంత ఆస్తి కనుక నాయుడుగారు నిజవారసుడికే అన్ని ఆస్తుల హక్కులూ దఖలు పరుస్తారు. పార్టీ తమ దంటూ కార్యకర్తలు అమితోత్సాహంతో పనిచేయడం, భంగపడటం, చివరికి తత్వం బోధపడి పార్టీ తమది కాదనీ, తాము కేవలం సమిధలమనీ గ్రహించి మౌనంగా బాధపడటం, మనస్తాపం చెందడం రివాజు. అన్ని పార్టీలలో జరుగుతున్న తంతే.

sonia with rahulసార్వత్రిక ఎన్నికలలో అతి దారుణంగా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి దిక్కు సోనియా, రాహుల్ గాంధీలే. రాహుల్ కాకపోతే ప్రియాంకను తేవాలంటారు కానీ సచిన్ పైలట్ కో, సింధియాకో, మరొకరికో పార్టీ పగ్గాలు అప్పగించాలని అనుకోరు. కడుపున పుట్టిన వారసులు లేని మాయావతి, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి నాయకులు ఎవరికి పగ్గాలు అప్పజెబుతారో తెలియదు. వారసురాలు ఉన్నప్పటికీ ఆమె ఉనికిని అజ్ఞాతంగా ఉంచుతున్న జయమ్మ ఏమి చేస్తుందో తెలియదు. కానీ ములాయంసింగ్ యాదవ్ నాయకత్వంలో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా గద్దెపైన కూర్చున్నాడు కానీ గత మూడు దశాబ్దాలుగా ములాయంకు అండదండగా ఉన్న నాయకులు ఎవ్వరూ ఆ పదవిని ఆశించే అవకాశం కూడా లేదు.

Kanna Lakshminarayana 1ఇటువంటి వాతావరణంలో కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడంలో వింత లేదు. ఇంతవరకూ భాజపాలో వారసుల బెడద ఉన్నత స్థాయిలో లేదు. రాష్ట్రాలలో లేకపోలేదు. లోక్ సభ, శాసనసభ ఎన్నికలలో అగ్రనాయకుల సంతానానికి టెక్కెట్లు ఇవ్వడం సాగుతూనే ఉంది. కానీ ముఖ్యమంత్రి పదవులూ, ప్రధానమంత్రి పదవీ వారసులకు కట్టబెట్టే సంప్రదాయం ఆ పార్టీలో ఇంతవరకూ లేదు. నరేంద్ర భాయ్ మోదీ కూడా బ్రహ్మచారి కనుక అటువంటి ప్రమాదం ఇప్పట్లో లేదు. అందుకే నేడు కన్నా కానీ రేపు కొణతాల రామకృష్ణ కానీ కాషాయాంబరాలు ధరించాలని నిర్ణయించుకుంటే ఆశ్చర్యం ఏముంది? కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ సమీప భవిష్యత్తులో మంచిరోజులు కనిపించడం లేదు. ఆ పార్టీలో కన్నాను పట్టించుకునే నాధుడు లేదు. అందులో అనేక ముఠాలు. ఒక్క శాసనసభ స్థానం కానీ లోక్ సభ స్థానం కానీ గెలుచుకోలేకపోయినా ముఠాలకూ, ఎత్తుగడలకూ, ఒకరిని ఒకరు దెబ్బతీసుకోవడానికీ కొదవ లేదు. స్వార్థ రాజకీయాలూ, అహంకారపూరిత ధోరణలూ, డబ్బు చుట్టూ, కులం చుట్టూ తిరిగే రాజకీయాలూ యథావిధిగా, నిస్సిగ్గుగా సాగిపోతూనే ఉన్నాయి. అందుకనే ఒక బ్రేక్ తీసుకుందామని కన్నాకు అనిపించింది. అందులో ఆయన తప్పులేదు. మొన్నటిదాకా మంత్రిగా ఉన్న కన్నా అధికారం లేకుండా, కనీసం పార్టీలో గౌరవ ప్రదమైన పాత్ర లేకుండా ఎన్నాళ్ళు మనగలుగుతారు. ఇప్పటికే పదవిపోయి అయిదు మాసాలు గడిచిపోయింది. ఇప్పట్లో భాజపాలో చేరడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి సంబంధించినంతవరకూ ఒక సీనియర్ నాయకుడుగా చెలామణి కావచ్చు. తన ముఠాకు భాజపాలో స్థానం కల్పించవచ్చు. కేంద్రంలో, రాష్ట్రంలో చిన్నా చితకా పనులుంటే చక్కబెట్టుకోవచ్చు. వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకోవచ్చు.

Konathala Ramakrishnaవైఎస్ ఆర్ సీపీ నుంచి బర్తరఫ్ అయినా మాజీ పార్లమెంటు సభ్యుడు కొణతల రామకృష్ణ మనోరథం సైతం ఇదే విధంగా ఉంటుంది. కన్నా లాగానే కొణతల కూడా వెనుకబడిన వర్గానికి చెందిన పెద్ద  నాయకుడు. వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలోని పార్టీలో తగినంత గౌరవం లభించడంలేదు. పైగా అవమానాలు ఎదురవుతున్నాయి. వచ్చే నాలుగున్నర సంవత్సరాలలో ఆ పార్టీ ఎట్లాంటి మార్పులకు లోనవుతుందో తెలియదు. జగన్ ను బయట తిరగనిస్తారో లేక జైలుకు పంపిస్తారో తెలియదు. ఎందుకొచ్చిన హైరాన? హాయిగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న భాజపాలో చేరిపోతే పోలా? మరి ఇంతవరకూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ, ఎండగడుతూ చేసిన ప్రకటనలు ఏమౌతాయి? తెలుగుదేశం పార్టీలో అధికారం పంచుకుంటున్న భాజపాలో చేరడం నైతికత అవుతుందా? అదే సందేహం కన్నానూ వేధించాలి.  teegela-244x300అదే నైతిక సందిగ్ధ పరిస్థితి శ్రీనివాస యాదవ్ కూ, తీగల కృష్ణారెడ్డికీ ఎదురు కావాలి. వారిద్దరూ తెలంగాణ రాష్ట్ర సమితినీ, దాని అధినేత కేసీఆర్ నీ నిర్దాక్షిణ్యంగా విమర్శించింది అయిదు మాసాల కింద జరిగిన హోరాహోరా ఎన్నికల పోరులోనే. వాటన్నిటినీ నాయకులు మరచిపోతారు సరే. ప్రజలు విస్మరిస్తారా? ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్ళీ అయిదేళ్ళ తర్వాత ఎన్నికలు వచ్చేవరకూ ప్రజలతో, వారి అభిప్రాయాలతో నిమిత్తం లేదు. తమ సంగతి, తమ కుటుంబం సంగతి, తమ వ్యాపారాల సంగతీ, తమ డబ్బు నిల్వల సంగతీ చూసుకుంటే చాలు. తమ ముఠాల సంగతి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తమ ప్రయోజనాలను ఎట్టిపరిస్థితులలోనూ కాపాడుకోవాలి. ఇదీ నేటి రాజనీతి. ఇదే ఈ రోజు చెలామణి అవుతున్న ప్రజాస్వామ్యం. దీన్నే సినీ, రంగస్థల నటుడు నాగభూషణం రక్తకన్నీరు నాటకంలో ‘డెమొకోర్స్’ అన్నాడు. అంటే భ్రష్టుపట్టిన డెమాక్రాసీ అని అర్థం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.