పుట్టంరాజువారికండ్రికలో సచిన్ పర్యటన

హైదరాబాద్, నవంబర్ 16: భారతరత్న, క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెందూల్కర్ నెల్లూరు జిల్లా, గూడూరు మండలంలోని పుట్టంరాజువారికండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. సచిన్ కు ఉన్నతాధికారులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. దత్తత తీసుకున్న గ్రామంలో తొలిసారిగా సచిన్ పర్యటిస్తున్నారు. సచిన్ రాకతో పుట్టంరాజువారికండ్రిగ గ్రామం పులకించిపోయింది. ఎప్పుడు టివిలో చూసే క్రికెట్ వీరుడు తమను ఆదుకునేందుకు రావడంతో గ్రామస్తుల్లో ఆనందాన్ని నింపుతోంది. మధ్యాహ్నం వరకు మాస్టర్ కండ్రికలోనే గడుపనున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టుగా ఏర్పాటు చేసిన పైలాన్ సచిన్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తుల ఇళ్లను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక చెరువులో చేపపిల్లలు వదిలి మీనోత్సవాన్ని ప్రారంభించారు. సచిన్ చూసేందుకు చుట్టుపక్కలనుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. గ్రామంలో రూ 2.79 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సచిన్ పరిశీలించారు. సచిన్ పర్యటన దృష్ట్యా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ, చాముండేశ్వరీనాథ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.