పుష్కరాల స్పెషలిస్ట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల సంరంభం ముగిసింది. గోదావరి పుష్కరాలతో పోల్చితే దేశం దృష్టిని ఆకర్షించే స్థాయిలో దుర్ఘటనలు ఏవీ జరగలేదు. ప్రశంసలే తప్ప, పుష్కరయాత్రికుల ఇబ్బందులు, అసౌకర్యాల గురించి పెద్దగా ఫిర్యాదులు వినిపించలేదు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రచారంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ మార్కులు కొట్టేసినట్టు కనిపిస్తోంది. ఆయన మొదటి నుంచీ అంతే. తను ఏ పని చేసినా పనిని మించి ఎక్కువ కొట్టొచ్చినట్టు కనిపిస్తారు. లేస్తే మనిషిని కానన్నట్టు హడావుడి చేస్తారు. యంత్రాంగంలో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని, కార్యదీక్షను నింపడానికి ఆ విధమైన శైలి తోడ్పడుతుందని ఆయన మద్దతుదారులు భావిస్తారు. అందులో వాస్తవం బొత్తిగా లేదని అనలేం. దాంతోపాటు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా వీలైనంత ప్రచారాన్నీ మూటగట్టుకుంటారు. కవిగారు ప్రబోధించినట్టు “సొంత లాభం కొంతమానుకునే” వర్గం వేరే ఉండచ్చు కానీ ఆ వర్గంలో నేటి  రాజకీయనాయకులు చేరరు. చేరాలని ఆశించడమూ అత్యాశే.

Kalluri Bhaskaram

భాస్కరం కల్లూరి

వేలు లక్షల సంఖ్యలో జనం ఒకచోట చేరే పుష్కరాల లాంటి సందర్భాలలో జనం భద్రతకు, శాంతిభద్రతలకు, సౌకర్యాలకు, గుంపు నియంత్రణకు, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, పటిష్టమైన ఏర్పాట్లు చేయవలసిందే. అది దాని కనీస బాధ్యత. మన దేశంలో గుంపు నియంత్రణ చాలా నాసిగా ఉండడమే కాదు పరమ ఘోరమైన దుర్ఘటనలకు దారి తీస్తుందన్న సంగతి తెలియనిది కాదు. ఇప్పటికీ ముఖ్యమైన పర్వదినాల్లో ప్రసిద్ధ దేవాలయాల దగ్గర తొక్కిసలాట జరిగి పదులు, వందల సంఖ్యలో జనం మరణిస్తున్న వార్తలు వస్తూనే ఉంటాయి. గుంపు నియంత్రణ పద్ధతుల్లో పోలీసులకు శిక్షణ ఉండకపోవడం ఒక కారణం. పోలీసులు తగినంత సంఖ్యలో ఉండకపోవడం ఇంకో కారణం. అందులోనూ పుష్కరాల లాంటి సందర్భాలలో వీఐపీల రక్షణతోనే వాళ్ళకు సరిపోతుంది. గతంలో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పుష్కరాల నిర్వహణలో పుష్కలంగా అనుభవం ఉన్నవారే. కానీ కిందటేడు గోదావరి పుష్కరాల మొదటి రోజున రాజమండ్రిలో తొక్కిసలాటలో 25 మందికి పైగా మరణించడాన్ని అది ఆపలేకపోయింది. భద్రత తాలూకు పోలీస్ మాన్యువల్ ను పకడ్బందీగా అమలుచేయాలన్న పట్టుదల పోలీస్ యంత్రాంగంలోనూ ఉండదు, అమలు చేయించాలన్న దృష్టి పాలకుల్లోనూ ఉండదు. ఆ ఘటనతో మేలుకుని ఆ తర్వాత ప్రభుత్వం ప్రజల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అటువంటివి పునరావృతం కాకుండా చూసింది. ఆ గ్రహింపు కృష్ణా పుష్కరాల నిర్వహణ మీదా సానుకూల ప్రభావం చూపింది. ఇది ఎంతైనా అభినందనీయమే. అయితే, ఈ జాగ్రత్త ఒక సంస్కృతిగా పోలీసుల్లోనూ, పాలకుల్లోనూ ఎంతవరకు ఇంకి స్థిరపడుతుందన్నది ప్రశ్న.

చంద్రబాబు సారథ్యంలో పుష్కరాల నిర్వహణ అతిగా మారిందన్న విమర్శలూ వచ్చాయి. పుష్కరాలు, కుంభమేళా వంటివి భారీ జనసందోహాన్ని ఆకర్షించే ఘట్టాలే కానీ; అవి భక్తి, ఆధ్యాత్మికతలతో ముడిపడినవి. పురాతన కాలం నుంచీ జరుగుతున్నవే కానీ కొత్తగా ఈనాటి ప్రభుత్వాలు ప్రారంభించినవి కావు. పుణ్యంకోసం, పురుషార్థం కోసం చేసే పుష్కరస్నానాలలో జనం స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఒకరి ప్రోత్సాహం కోసం, ప్రోద్బలం కోసం ఎదురు చూడరు. ఆవిధంగా ప్రభుత్వానికీ, మతధార్మిక సంబంధమైన ఇలాంటి కార్యక్రమాలకూ మధ్య సహజంగానే  ఒక అడ్డుగీత ఏర్పడింది.  ఆ అడ్డుగీతను మరింత బలోపేతం చేయడం నేటి మన ప్రజాస్వామిక రాజ్యాంగ లక్ష్యాలలో ఒకటి. అందుకు భిన్నంగా ఆ అడ్డుగీతను చెరపడానికి ప్రభుత్వమే పూనుకుందా అనిపించే రీతిలో పుష్కరాల నిర్వహణ జరిగింది. పుష్కరాలకు తరలిరండి అంటూ ప్రభుత్వమే ప్రకటనలు చేసింది. బస్సుల మీద రాయించింది. పుష్కర యాత్రికులను కోట్లల్లో రప్పించడం తన ఘనతగా చూపించుకుంటోంది.

జన్మభూమి, నీరు-మీరు, స్వచ్ఛభారత్, చెట్ల పెంపకం, ఇంకుడు గుంతలు మొదలైన సెక్యులర్ కార్యక్రమాల ప్రచారంలో, అమలులో ప్రభుత్వం జోక్యం ఎంతైనా అవసరం, అభిలషణీయం. కానీ మత, ధార్మిక కార్యక్రమాలలో మితిమీరిన జోక్యం, వాటిని ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించడం ఒక అవాంఛనీయ ఆనవాయితీకి దారితీస్తాయి. ఎందులోనైనా ఔచిత్యాన్ని, హద్దును పాటించడం అవసరం. అత్యుత్సాహవంతులైన రేపటి పాలకులు దీనిని ఒరవడిగా తీసుకుని ఏడాది పొడవునా ప్రజలు సాంప్రదాయికంగా జరుపుకునే పండుగలను, కార్తీక వన సమారాధనలను, కార్తీక స్నానాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా జరిపించే పరిస్థితి రాకూడదు. ఎక్కువమంది జనం చేరేచోట వారి భద్రతకు, రక్షణకు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పరిమితం అవాలి.

వీలైనంతవరకు భక్తులు మెచ్చేలా పుష్కరాలను నిర్వహించడాన్ని తక్కువ చేయడంలేదు. దానిని ఎంతైనా అభినందించవలసిందే. అతి పనికిరాదని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. చంద్రబాబు గతంలో అవిభక్తఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి అంకితమైన ముఖ్యమంత్రిగా ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ ఈసారి గత రెండేళ్లలో ‘పుష్కరాల స్పెషలిస్ట్’గా ఇమేజ్ పెంచుకోడానికి పాటుపడుతున్నట్టు కనిపిస్తున్నారు. ప్రభుత్వమూ, ముఖ్యమంత్రీ ఇమేజ్ పెంచుకోడానికి అంతకన్నా మరొకటి లేదా అన్న ప్రశ్నకు అది దారితీస్తోంది. అది మంచిది కాదు.

-భాస్కరం కల్లూరి

Have something to add? Share it in the comments

Your email address will not be published.